టాలీవుడ్ లో గానీ, కోలీవుడ్ లో గానీ, బాలీవుడ్ లో గానీ ఈ మధ్య కాలంలో లైంగిక వేధింపులపై పెద్ద రసవత్తరమైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలనే సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ పై జరుగుతున్న లైంగిక దాడులపై పెద్ద దుమారం చెలరేగింది. అది ఇంకా నడుస్తూనే ఉంది. మొన్నామధ్య మలయాళీ నటిని కిడ్నప్ చేసి ఆపై లైంగిక వేధింపులకు గురిచేసినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే విషయానికి సంబంధించి సినిమా పరిశ్రమలో ఒక్కో హీరోయిన్ స్పందిస్తున్న తీరుపై ఆసక్తిరేగుతుంది.
తాజాగా రిచా గంగోపాధ్యాయ కూడా ఒక్క సినిమా పరిశ్రమలోనే కాకుండా సమాజంలోని అన్నిరంగాలలోనూ మహిళలు వేధింపులకు గురౌతున్నారని, ఆ విషయంలో టాలీవుడ్ చాలా ప్రశాంతంగా ఉంటుందని, ముఖ్యంగా మహిళలు స్వతంత్రంగా ఎదుగుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. అదేవిధంగా మలయాళ నటి భావన ఘటనపై ఇప్పటికే క్రేజీ హీరోయిన్స్ తాప్సి, అమలా పాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వాళ్ళు స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మిల్కి బ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది.
కాగా తమన్నా మాట్లాడుతూ... గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మంచి మార్పులే వచ్చాయని, ఇంతకు ముందు మహిళలు అన్ని రంగాల్లోనూ అణచివేతకు గురయ్యారని వెల్లడించింది. ఇంకా తమన్నా స్పందిస్తూ... సినిమా పరిశ్రమలో కూడా స్వతంత్రత లభిస్తోందని, ఇక్కడ హీరోయిన్స్ ను చాలా ఉన్నతంగా, గౌరవంగా చూపించడం, ఆదరించడం వంటివి ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటున్నాయని అన్నదీ మిల్కీ బ్యూటీ. ఇదివరకటిలా ఫలానా దుస్తులే ధరించాలనే ఇప్పుడు అంతగా ఒత్తిడి తేవడం లేదని చెప్పిందీ ముద్దుగుమ్మ. అంతే కాకుండా ఎందులోనైనా గానీ మహిళలు ఏమాత్రం ఆత్మాభిమానం కోల్పోవలసిన అవసరం లేదని, అదేవిధంగా పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్స్ ఒకరు ఇస్తే పొందే స్థాయికి రాకూడదని, వాటిని మనమే సాధించుకోవాలని మరీ చెప్పిందీ మిల్కీబ్యూటి తమన్నా.