ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్ పై జగన్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ జగన్ ను పలువురు విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటన్నింటికీ జగన్ చాలా ఓపికగా సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ విలేకరి మాట్లాడుతూ.. జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయపార్టీగా మార్చినాటికి అవతరిస్తుందని, రాబోవు 2019 సాధారణ ఎలక్షన్స్ లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని జగన్ ని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు జగన్ స్పందిస్తూ... తాను ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోటుపాట్లను గురించి ప్రస్తావించుకోడానికి కదా.. మధ్యలో ఈ పవన్ కల్యాణ్ గురించి మనకెందుకబ్బా అని వెల్లడించాడు. అంతటితో జగన్ ను విలేకరులు వదిలిపెట్టకుండా మరో విలేకరి పవన్ ప్రస్తావన తెచ్చాడు.
జనసేన పార్టీ ప్రజల సమస్యలే ప్రాతిపదికగా, ప్రజా సమస్యల అజెండాతో ముందుకు వెళ్లాలనుకుంటుంది కదా అని ప్రస్తావించగా.. అందుకు జగన్ ఆసక్తికరంగా స్పందించాడు. జగన్.. పవన్ పై స్పందిస్తూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ఏ నాయకుడూ పోరాటం చేసినా దానికి తాము సంపూర్ణ మద్దతిచ్చి మరీ స్వాగతిస్తామని, అది జనసేన పార్టీకానీయ్, ఏ పార్టీ కానీయ్. అందుకు వైకాపా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ వెల్లడించాడు. వారికి వైకాపా అండగా నిలుస్తుందని కూడా తెలిపాడు. ఇదే సందర్భం చేసుకొని పవన్ గురించి జగన్ ప్రస్తావించాడు. జనసేన అధినేత పవన్ తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని తెలిపి విషయం పట్ల ఆసక్తిని రేపాడు. పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు అధీనంలోనే ఉన్నాడని, బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ పొజిషన్ లోనే ఇంకా పవన్ కొనసాగుతున్నాడని జగన్ వెల్లడించాడు. పవన్ అలాంటి పరిస్థితులనుండి వీలైనంత తొందరగా బయటపడి తన స్వతంత్ర మార్గాన్ని ఎంచుకోవాలని, అప్పుడు ప్రజా సమస్యలపై పోరాడాలని వివరించాడు జగన్. పవన్ అలా ప్రజా సమస్యలపై పోరాడాలని తాను కోరుకుంటున్నట్లు కూడా జగన్ వెల్లడించాడు.