నిన్న మొన్నటి దాకా పవన్ సినిమాలలో బిజీగా ఉంటే.. చిరు రాజకీయాలలో బిజీ బిజీగా.. సినిమా ఫీల్డ్‌కు దూరంగా దాదాపు దశాబ్దం గడిపాడు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఇద్దరు విచిత్రంగా రివర్స్ అయ్యారు. పవన్ రాజకీయాలలో బిజీగా మారుతుంటే.. చిరు మరలా సినిమాలపై దృష్టి పెట్టాడు. ఇటీవలే తన 150వ చిత్రంగా 'ఖైదీనెంబర్ 150'గా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించి, తన సత్తా ఇంకా తగ్గలేదని బాక్సాఫీస్ సాక్షిగా నిరూపించాడు. దక్షిణాదిలో తన సత్తా ఏ పాటిదో చాటి.. బాస్ ఈజ్ బ్యాక్ అంటే ఏమిటో చూపించాడు. ఇక 150వ చిత్రం విడుదల కాకముందే ఆయన నటునిగా బిజీ బిజీగా మారాలని నిర్ణయించున్నాడు. కాగా ప్రస్తుతం చిరు తన 151వ చిత్రంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే హిస్టారికల్ చిత్రాన్ని చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్‌చరణే నిర్మించనున్న ఈ చిత్రం సబ్జెక్ట్‌పై ప్రస్తుతం సురేందర్‌రెడ్డితో పాటు సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఆయన 152వ చిత్రాన్ని గీతాఆర్ట్స్ బేనర్‌లో అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్న సంగతి కూడా తెలిసిందే. కాగా ఈ తర్వాతి రెండు చిత్రాలకు కూడా ఆయన నిర్మాతలను ఫైనల్ చేసేశాడు. తన 153వ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్‌కు, 154వ చిత్రాన్ని జెమిని ఫిల్మ్‌సర్క్యూట్స్ పతాకంపై జెమిని కిరణ్‌కు చిత్రం చేయనున్నాడు. ఈ రెండు చిత్రాల దర్శకుల విషయంలో క్లారిటీ రావడం లేదు. కానీ ఈ రెండు చిత్రాలను ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్‌ల దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బాస్ ఈజ్ బ్యాక్ అంటే ఏమిటో చూపిస్తున్న చిరు ఇతర స్టార్స్ గుండెల్లో దడ పుట్టిస్తున్నాడనేది నిజం...!