ఏ వుడ్ లో అయినా గానీ సినిమా ప్రారంభించే ముందు ‘మద్యపానం హానికరం‘ అని ప్రత్యేకంగా చూయించకుండా చిత్రం స్టార్ట్ చేయని విషయం తెలిసిందే. అయితే... సాధారణంగా తాగుడు సన్నివేశాలను దర్శక రచయితలు ఇద్దరూ సరదా కోసం, కాసేపు ప్రేక్షకులను వినోదాన్ని పంచడం కోసం కావాలని చేర్చుతుంటారు. ఇది కాదనరాని సత్యం. అయితే అది కొంత మంది హీరోల విషయంలో అయితే సెంట్ మెంట్ గా ఫాలో అవుతుంటారు దర్శక రచయితలు. ఏదో ఒకటి చిన్న తాగుడు సన్నివేశం కల్పించి దాని ద్వారా ఎంటర్టైన్మెంటును పంచడానికి నానా ప్రయత్నాలు జరుపుతుంటాకు. కొన్ని సినిమాల్లో ఆ సన్నివేశం బాగా పండుతుంది. కొన్ని సినిమాల్లో అయితే ఆ తాగుడు సన్నివేశం వాళ్ళు అనుకున్న విధంగా, ఆశించిన చందంగా పండదు. అలా అలరించదు.
టాలీవుడ్ లో కొంతమంది దర్శకులు అంటే శ్రీను వైట్ల లాంటి వారు అయితే ఖచ్చితంగా తన సినిమాల్లో మందు సీన్ తో అలరిస్తుంటారు. అలా ఇంకా చాలా మంది దర్శకులు సినిమా అవసరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఆనందం కోసమే కథలో ఆయా సన్నివేశాలను చొప్పిస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కైతే అసలు చెప్పక్కరలేదు. ఖుషి సినిమాలో ఏకంగా ఓ జానపదం స్టైల్లో ‘రంబబోతే రంబబోతే, భయ్ భయ్యే బంగారు రమణమ్మ... బావి చెరువు కాడ బోరింగు రమణమ్మ’ అంటూ సాగే ఈ పాటలను ప్రేక్షకులను ఎలా అలరించాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అదే తాగుడుకు సంబంధించే ప్రత్యేక సాంగులను కూడా పెట్టేస్తున్నారు. ఈ మధ్య వెంకటేష్ గురు సినిమాలో జింగిడి జింగిడి అంటూ ఓ మందు పాట రిలీజ్ చేసిన విషయం కూడా విదితమే. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అయిన కాటమరాయుడులో మూడు పాటలను విడుదల చేయగా... ముచ్చటగా వచ్చిన మూడోపాట ‘జివ్వు జివ్వు’ అంటూ అలరిస్తున్న ఈ పాట మందుబాబులను ఉద్దేశించిందే. ‘రాజులైనా.. బంటులైనా.. కూలీలైనా.. యాపారులైనా.. రాతిరైతే చుక్క కోసం జివ్వు జివ్వు’ ఇలాంటి మంచి క్యాచి లిరిక్స్ తో సాగిపోయిందీ పాట. ఇంకా ఆ మధ్య గబ్బర్ సింగ్ చిత్రంలో కూడా ఏకంగా 'మందుబాబులం.. మేము మందుబాబులం’ అంటూ ఓ పాట పెట్టేసిన విషయం కూడా విదితమే. మొత్తానికి పవర్ స్టార్ కి మందు పాటతో, సన్నివేశానికో మంచి కనెక్షన్ ఉండి వర్కవుట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దర్శకుడు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. అందుకనే పవర్ స్టార్ సినిమా కోసం మందు సందర్భాన్ని కల్పించి మరీ ఆ సన్నివేశాన్ని ఖచ్చితంగా విధిగా పాటిస్తున్నారు.