2017 ప్రారంభమై మూడు నెలలు పూర్తి కాకముందే మంచు మోహన్ బాబు నట వారసులు మంచు విష్ణు, మంచు లక్ష్మి ప్రసన్న, మంచు మనోజ్ లు తమ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు ఈ ఏడాది విడుదలైన సినిమాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ముందుగా గణతంత్ర దినోత్సవం సందర్భముగా జనవరి 26 న 'లక్కున్నోడు' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు విష్ణు ఫస్ట్ షో నుండే ప్రేక్షకుల మౌత్ టాక్ బాగా నెగటివ్ గా ఉండటంతో సినిమా వైఫల్యం నుంచి బైట పడలేకపోయాడు. అయితే 'లక్కున్నోడు' విషయంలో విడుదల వ్యూహం కూడా పకడ్బందీగా లేకపోవటం విచారకరం. అప్పటికి సూర్య నటించిన 'ఎస్-3' సినిమా విడుదల గణతంత్ర దినోత్సవం రోజు నుంచి కూడా వాయిదా పడటంతో మంచు విష్ణు హడావిడి గా తన సినిమాను విడుదల చేసేసాడు. అయినా విష్ణు మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు.
ఇక ఈ నెల 3 న మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మంచు మనోజ్ నటించిన 'గుంటూరోడు' రెండవ రోజు నుంచే కలెక్షన్స్ పడిపోయి నిర్మాతలకు, పంపిణీదారులకు ఆర్ధిక నష్టాలను మిగిల్చింది. ఇక నిన్న(శుక్రవారం) విడుదలైన 'లక్ష్మి బాంబు' చిత్రంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించగా ఈ చిత్రం నగరం, 16 వంటి అనువాద చిత్రాల పోటీ మధ్య లో కొట్టుకుపోయి రొటీన్ రివెంజ్ డ్రామా గా మిగిలిపోయింది. మొత్తానికి కొత్త ఏడాది ప్రారంభమై మూడు నెలలు తిరగకముందే మంచు వారి ముగ్గురు నట వారసులు చేదు జ్ఞాపకాలను మూటకట్టుకున్నారు పాపం. మరి 2017 ప్రథమార్ధంలో ఇలా ప్లాపుల బారిన పడిన ఈ మంచు వారసులు 2017 ద్వితీయార్ధంలోనైనా మంచి సినిమాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటారేమో చూద్దాం.