సరిగ్గా మార్చి 8వ తేది మహిళా దినోత్సవం రోజే మహిళలపై దౌర్జన్యం, అక్రమంగా అరెస్టులు చేసి గర్భిణులు అని కూడా చూడకుండా లాక్కుంటూ- ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిన పోలీసులు- ఇది మన ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రభుత్వం తీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు గ్రామ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై బూట్లతో దాడి చప్పుళ్ళు ప్రతిధ్వనిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందంటే... మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. దీని కారణంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో సుమారు 33 గ్రామాల ప్రజల జీవనం దుర్భరంగా మారుతుందని, ఆ పార్క్‌ను వేరే ప్రాంతంలో ఎక్కడన్నా నిర్మించాలంటూ స్థానిక ప్రజలంతా చాలా కాలం నుండి ఘోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటికప్పుడు ప్రజల కన్నీటిని తుడిచేందుకు అటు ప్రతిపక్షం, అలాగే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా తాను చూసుకుంటానని ప్రజలకు తాత్కాళిక ఉపశమనమైతే ఇచ్చారు గానీ ఆ తర్వాత ప్రభుత్వం తీరు, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న రీతిలో ఉంటే ఆ పవర్ స్టార్ ఏమాత్రం పట్టించుకోక పోవడం ఎంతో శోచనీయం.
ఇంకా ప్రభుత్వం ఆయా గ్రామాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ ను విధించి మరీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఏ ఒక్క నాయకుడు గొంతెత్తి మాట్లాడక పోవడం మరీ విచారకరం. అప్పట్లో తాను రైతుల వెంటే ఉంటాననీ, వారి వెనకాలే నడుస్తానని మాటిచ్చిన పవన్ కల్యాణ్ ఏమైపోయారంటూ అక్కడి ప్రజలంతా ప్రశ్నిస్తుంటే అలాంటి ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడు కనపడటం లేదు సరికదా వారికి ఇంత జరుగుతున్నా వారి గొంతుకను ఏమాత్రం పట్టించుకోకపోవడం ఎంతైన ప్రమాదకరం. ప్రజల కష్టాలు తన కష్టాలుగా చేసుకొని తమ తరఫున ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యవర్తిత్వం నడిపే పవర్ స్టార్ ఏమయ్యాడంటూ తుందుర్రు గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా అక్కడి ప్రజలు ఈ నాయకుడు అందరిలాంటి నాయకుడేనంటూ పవన్ ను దుర్భాషలాడుతున్నారు. గతంలో ఆక్వా రైతులు పవన్ కల్యాణ్ ను కలిసి తమ పొలాలు నాశనమైపోతున్నాయనీ, తమ బ్రతుకులు ఈ ఫ్యాక్టరీ కారణంగా బుగ్గిపాలు అవుతాయని, ఆయా గ్రామాల్లోని మగాళ్లను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ మొరపెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చలించిపోయిన పవన్ హృదయం ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘మీ వెంట నేనుంటా’ నంటూ హామీలు గుప్పించి ధైర్యం చెప్పి పంపించిన సంగతి కూడా విదితమే. ఆ సందర్భంగా ఇది చాలా దుర్మార్గమైన అంశం అంటూ తనదైన శైలిలో పవన్ స్పందించాడు కూడాను.
అయితే ప్రస్తుతం ఆయా గ్రామాల్లో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే ఆయన మాటకాదు కదా ట్విట్టర్ స్పందన కూడా కరువైందంటూ ప్రజలంతా విస్తుపోయి మరీ ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రజలే ప్రస్తుతం పవన్ కల్యాణ్‌ను కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయా? అంటూ అనుమానిస్తున్నారు. ఇంకా పవన్ కు ఖాలీ దొరికినప్పుడు మాత్రమే తమ గురించి ఆలోచిస్తాడా అంటూ కూడా అనుమానిస్తున్నారు. ఈ విషయంలో విచిత్రమైన అంశం ఏంటంటే... గతంలో ఇక్కడ ఆక్వాఫుడ్ ప్రాజెక్టును చంద్రబాబు కూడా వ్యతిరేకించాడు. అలాగే ఎన్నికల ముందు జరిపిన పాదయాత్రలో కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తానని కూడా మాటిచ్చాడు. ఇంత చేసి అధికారం కైవసం అయ్యాక మాట మటుమాయమైపోయిందంటూ ప్రజలు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. అయితే ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. ఇలాంటి ఈ విధమైన ప్రాజెక్టులను వ్యతిరేకించే వారంతా అభివృద్ధికి ఆటంకవాద శక్తులు అంటూ అపనిందలు మోపుతున్నాడు. ఇలా తుందుర్రుల్లో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుండి అధికారికంగా ఏమాత్రం స్పందన రాకపోవడం చాలా విచారకరమైన అంశం. ఇలాంటి సందర్బంలో ఇక ఎవరూ దిక్కూ అంటూ తుందుర్రు గ్రామ ప్రజలంతా పవర్ స్టార్- తమ ఘోషను పట్టించుకోండి అంటూ వేడుకుంటున్నారు.