సినిమాల్లో శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే సందర్భాలు అనేకం ఉంటాయి. అలాంటి సందర్భాన్ని సీనియర్ నటి జయసుధ నిజజీవితంలో తెలివిగా ఉపయోగించుకుంది. సుదీర్ఘ నటజీవితం ఉన్న సహజనటి ప్రదర్శించిన చాణక్య నీతి సినీ వర్గాలని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.
వివాదాలకు దూరంగా ఉండే జయసుధకు కూడా ఇలా ప్రవర్తించడం విశేషం. అసలు జరిగిందేమిటంటే. సరిగ్గా రెండేళ్ళ క్రితం మా ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష స్థానానికి రాజేంద్రప్రసాద్‌తో మురళీమోహన్ మద్దతుతో పోటీ చేసిన జయసుధ ఓడిపోయింది. ఇదంతా గతం. కానీ ఓడిపోయిన జయసుధ మాత్రం రాజేంద్ర ప్రసాద్‌ను టార్గెట్ చేసింది. అవకాశం నంది అవార్డుల రూపంలో కలిసి వచ్చింది. మురళీమోహన్ సహకారంతో 2012 ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు జ్యూరి చైర్మన్‌గా వ్యవహరించిన జయసుధ అవార్డుల పోటీకి వచ్చిన 'ఓనమాలు' చిత్రాన్ని కావాలనే నొక్కిపెట్టిందని అంటున్నారు. ప్రధాన పాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి అవార్డు దక్కకుండా పావులు కదిపింది. ఉత్తమ చిత్రాల కేటగిరిలో కూడా 'ఈగ', 'మిణుగురు', 'మిథునం' చిత్రాలకు పురస్కారాలు లభించాయి. విమర్శకుల ప్రశంసలు పొంది, గురుశిష్యుల అనుబంధాన్ని తెలియజెప్పిన 'ఓనమాలు' చిత్రానికి ఎలాంటి అవార్డు దక్కకపోవడం గమనార్హం. ఇదంతా జయసుధ కావాలనే చేసిందని రాజేంద్రప్రసాద్ సన్నిహితులు భావిస్తున్నారు.