టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశిఖన్నా ఈ మధ్య చాలా చురుకుగా కనపడుతుంది. గతంతో పోల్చుకుంటే రాశీఖన్నాకు ప్రస్తుతం సినిమాలు కొంచెం తక్కువైనప్పటికీ ఈమెలో ఉత్సాహం మాత్రం అమితంగా ఉరకలేస్తుందనే చెప్పాలి. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రాశీఖన్నా... మొదట్లో కాస్త బొద్దుగా ఉన్నా ప్రస్తుతం మాత్రం కాస్త చిక్కి రెట్టించిన జోష్ ను ప్రదర్శిస్తుందనే అనుకోవాలి. అందుకనే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది రాశీఖన్నా.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాల్లో వున్న మహిళల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మహిళా సాధికారత అంటూ, స్త్రీ ఔనత్యం, సమాజంలో మహిళల పాత్ర అంటూ పలువురు పలు రకాలుగా మహిళాశక్తిని గురించే చర్చించుకుంటున్న ఈ సమయంలో.. రాశీఖన్నా'బిలీవ్ ఇన్ యూ' అనే టైటిల్ తో ఓ వీడియోను రూపొందించి విడుదల చేసింది. ఈ వీడియోలో తాను నటించడమే కాకుండా... ప్రొడ్యూస్ కూడా ఆమె చేసింది. స్వయంగా రచయిత అయిన రాశీఖన్నా అందులో కథా కథనం అంతా ఆమె దగ్గరుండి చూసుకుంది. మీలో అమితమైన శక్తి దాగి ఉందని దాన్ని నమ్మాలి అంటూ.. మిమ్మల్ని మీరు ఎందుకు నమ్మాలో.. చెప్పిన తీరు చాలా బాగా కుదిరిందనే చెప్పాలి. అయితే వీడియో చూస్తేనే ఇదేదో జిమ్ సెంటర్ లో శరీర దారుడ్యాన్ని ప్రదర్శించడానికి పడే కష్టాలు, తపన అన్నట్లుగా తయారైంది. పవిత్రమైన మహిళా శక్తిని చాటుతూనే అదీ వీడియో రూపొందించడంలో ఓ యాడ్ లా చూపరులకు కనువిందు చేస్తుంది. మొత్తానికి రూపొందించిన వీడియో ఎలా ఉన్నా రాశి ఖన్నా చెప్పాలనున్నది అందులో కంటెంట్ మాత్రం అదిరింది. బిలీవ్ ఇన్ యూ అంటూ టైటిల్ పెట్టి మరీ వీడియో రూపొందించారంటే రాశీఖన్నాలోని తన సాహితీపరమైన కోణాన్ని కూడా బయటపెట్టినట్లుగానే తెలుస్తుంది.