తమిళనాడులో ఈ మధ్య రాజకీయాలు చాలా రసాభాసగా మారిన విషయం తెలిసిందే. అటువంటి రాజకీయ డ్రామాలను చూసి ప్రముఖులు ముక్కు మీద వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళ ప్రజలకే సిగ్గు చేటుగా అక్కడ రాజకీయాలు మారిన నేపథ్యంలో తాజాగా కమల్‌హాసన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తుంది. కాగా కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి తెరవెనుక ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే కమల్ హాసన్ ప్రత్యేకంగా ఒక పార్టీ స్థాపిస్తాడా? లేక మరో ఏదైనా పార్టీలో చేరుతాడా? అనేది చాలా ఉత్కంఠ రేపుతుంది.
అయితే ఈ అంశం ఇంతగా మాధ్యమాల్లో ఎందుకు చక్కర్లు కొడుతున్నది అనే విషయాన్న ప్రస్తావిస్తే...తాజాగా కమల్‌హాసన్ చెన్నై అళ్వార్‌పేటలోని ఆఫీసులో తన అభిమాన సంఘాలకు చెందిన నేతలతో అత్యవసర సమావేశం జరిపినట్లు తెలుస్తుంది. దాంతో అక్కడ సుమారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడ సుదీర్ఘ సమాలోచనలు, చర్చలు జరిగినట్లుగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ అభిమాన సంఘాల నుండి పలు సూచనలు, సలహాలు తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే జయలలిత మరణం తర్వాత జరిగిన కొన్ని ప్రత్యేక పరిస్థితులకు కమల్ హాసన్ స్పందిస్తున్న తీరును గమనిస్తే... జల్లికట్టు ఉద్యమానికి కమల్ హాసన్ మొట్ట మొదటే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆ ఉద్యమానికి కమల్ తన వాణిని చాలా బలంగా వినిపించాడనే చెప్పాలి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అన్నాడీయంకేలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు కమల్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు కూడాను. అసలు పన్నీర్ సీఎం పదవికి రాజీనామా చేయించిన తీరుపై కమల్, శశికళపై పెద్ద ఎత్తున మండి పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత శశికళ జైలుకి వెళ్లడం, పళనిస్వామి తమిళనాట సీయం కావడం వంటి రాజకీయ పరిణామాలపై కమల్ హాసన్ చాలా సునిశితంగా ఎత్తిచూపిన సందర్భాలను మనం చూశాం. ఇంకా ఆ సందర్భాలతో చలించిపోయిన కమల్ తనను ఎవరూ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఆహ్వానించవద్దంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం తమిళనాడులో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయాలను గమనిస్తే, ఇదే సందర్భంలో కమల్ హాసన్ అభిమానులతో అత్యవసర భేటీలు నిర్వహించడంతో పరిస్థితులు కాస్త ఆసక్తిని రేపే విధంగానే ఉన్నాయి.
అంతే కాకుండా నిన్నటికి మొన్న కమల్ హాసన్ ట్విట్టర్ లో తమిళ ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే, తామే ప్రత్యక్షంగా రంగంలోకి దూకి ఆ పనులు చేయాల్సి వస్తుందంటూ ప్రకటన కూడా చేసేశాడు. దీనికి తోడు కోలీవుడ్ లో కమల్ హాసన్ కు బలమైన నేతలు, కార్యకర్తల, అభిమానుల మద్దతు కూడా బాగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే రాబోవు రోజుల్లో తమిళనాడులో ఎన్ని ఆసక్తికరమైన రాజకీయ వార్తలను వినాల్సివస్తుందో వేచి చూద్దాం.