జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు రాజకీయాలతోనూ, ఇటు సినిమాలతోనూ యమా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పవన్ వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఎన్ని వీలైతే అన్ని సినిమాలను చేయాలన్న తలంపుతో ఏమాత్రం విశ్రాంతి లేకుండా సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ త్వరితగతిన సినిమాలను పూర్తి చేస్తున్న విషయం కూడా విదితమే. అందులో భాగంగానే కాటమరాయుడు సినిమాను ఓ పక్క షూటింగ్ ను, డబ్బింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఏక కాలంలో చేసుకుంటూ అనుకున్న తేదీకి విడుదల చేసేందుకు చిత్రబృందమంతా శతవిధాలా ప్రయత్నాలు జరుపుతుంది. ఓ పక్క ప్రమోషన్ కూడా చేసేస్తుంది. అందులో భాగంగానే కాటమరాయుడు చిత్రం టైటిల్ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. మిరా మిరా మీసం అనే పాటను తొలుత విడుదల చేసిన ఈ పాటలో పదాలు యువతను ఉరకలు పెట్టించేలా ఉన్నాయి. ఈ పాట కోసం వాడిన పదాలను ఒక్కసారి గమనిస్తే.. నాయకుడై నడిపించేవాడు… సేవకుడై నడుం వంచే వాడు… అందరికోసం అడుగేశాడు.. కాటమరాయుడు... అంటూ పవన్ క్రేజ్ కు తగినట్లుగా ఈ పాట సాగుతుంది. ఇంకా రెపరెపలాడే జెండాల పొగరున్నోడు... తల వంచక మిన్నంచుల పైనే వుంటాడు….ఇలా చరణాల్లో గల పాదాల్లో పవన్ కల్యాణ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే పదాలను వాడటం జరిగింది.
దీన్ని బట్టి చూస్తే ఈ పాట నిజంగా 2019లో రాబోయే సాధారణ ఎన్నికల ప్రచారానికా? ఈ పాట అన్నట్టుగా కూడా ఉందని సినీ విమర్శకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి జనసేన పార్టీ తరపున పోటీకి కూడా నిలబడతానని ఇప్పటికే పలు బహిరంగ సభల సాక్షిగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ కాటమరాయుడు టైటిల్ సాంగ్ ను మనం తరచి చూసినట్లయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్‌ని మరింత పెంచేదిగా ఉన్నట్లే తెలుస్తుంది. అందుకోసమే ఈ పాటను రూపొందించారా? అని కూడా అనుకోడానికి ఆస్కారం మెండుగా ఉంది. కాటమరాయుడు టైటిల్ సాంగ్ ను విన్నట్లయితే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రచారానికి ఈ పాటను బాగా వాడుకోవడానికి అనువుగా ఉందన్న విషయం కూడా తెలిసిపోతుంది. క్యాచీ ట్యూన్, రామజోగయ్య శాస్త్రి మంచి ప్రభావం చూపే లిరిక్స్ ఈ పాటని ఆదిశగా కూడా నడిపించడానికి ఎంతో దోహదం చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలా విడుదలైన ఈ సినిమా టైటిల్ సాంగ్ ఇప్పటికే యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది.