సినీ పరిశ్రమ అంటే ఓ వైకుంఠపాళీ. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక్కసారి భారీ పాము నోట్లో పడితే అధో:పాతాళమే. ఇదో చిత్ర విచిత్రమైన పరిశ్రమ. ఇక్కడ అందరికీ కేవలం హిట్ మాత్రమే కావాలి. ఎన్నిహిట్లు ఇచ్చినా ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే ఇక అంతే సంగతులు. ఎవరో కొందరు మాత్రం దీనికి మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ఇక 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ద్వారా నంది అవార్డును సొంతం చేసుకున్న శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి 'బ్రహ్మోత్సవం' తర్వాత ఏమైందీ అందరికీ తెలిసిందే. ఇదే కోవలో మరికొందరిని కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 'బొమ్మరిల్లు, పరుగు' చిత్రాలతో బొమ్మరిల్లు భాస్కర్‌ను అందరూ ఆకాశానికి ఎత్తేశారు. కానీ 'ఆరెంజ్' తర్వాత ఆయన పరిస్థితి యదా మామూలే. 'ఒంగోలు గిత్త, బెంగుళూర్ నాట్కల్'లు వచ్చినా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో కూడా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇక 'హైపర్' తర్వాత సంతోష్‌శ్రీనివాస్ ఏమయ్యాడో తెలీదు. దిల్‌రాజు బేనర్ అంటే ఎంతో గొప్ప. ఆ బేనర్‌లో దర్శకునిగా పరిచయం అయ్యే అవకాశం వస్తే అదృష్టం అనేది శనిలా పడుతుంది. కానీ నాగచైతన్య వంటి హీరోను పరిచయం చేసే అదృష్టాన్ని పొంది... 'జోష్'తో వాసు వర్మ అందరినీ నిరుత్సాహపరిచాడు, హిట్స్, ఫ్లాప్స్‌ను పట్టించుకోని నాగ్‌కు సైతం కోపం తెప్పించాడు. మరలా దిల్‌రాజే ఆయన మీద నమ్మకంతో సునీల్ హీరోగా నటించిన 'కృష్ణాష్టమి' ద్వారా మరో చాన్స్ ఇచ్చాడు. దాన్ని కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో వాసువర్మ పరిస్థితి కూడా షరామామూలే. ఇక 'పాండవులు పాండవులు తుమ్మెద' తో ఫర్వాలేదనిపించుకుని 'లౌక్యం'తో పెద్ద హిట్ కొట్టిన శ్రీవాస్‌కు బాలయ్య పిలిచి మరీ 'డిక్టేటర్' అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఫలితం అందరికీ తెలిసిందే. ఆ చిత్రం విడుదలై ఏడాది దాటిపోతున్నా కూడా ఆయనకు మరో అవకాశం వచ్చినట్లుగా వినిపించడం లేదు. ఇది ఎందరో భావిదర్శకులకు ఓ మంచి పాఠంగా చెప్పుకోవచ్చు.