ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీగా విడుదలయ్యాయి. చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150', బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి', దిల్‌రాజు-శర్వానంద్‌ల 'శతమానం భవతి' రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రాలు విడుదలై 50 రోజులు పూర్తయింది. నేటిరోజుల్లో అర్ధశతదినోత్సం, శతదినోత్సవం సెంటర్ల రికార్డుల కంటే.. కలెక్షన్ల రికార్డులే ముఖ్యమయ్యాయి. ఇక మొదటగా విడుదలైన చిరు 'ఖైదీ నెంబర్ 150' చిత్రం విషయానికి వస్తే చిరు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న మూవీ కావడం, 'కత్తి'కీ రీమేక్ కావడం, పదేళ్ల తర్వాత కూడా చిరు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడంతో ఈ చిత్రం కమర్షియల్‌గా దున్నేసింది. ఇక ఈ చిత్రం విషయంలో ట్రేడ్‌వర్గాల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఈ చిత్రం బిజినెస్ 89కోట్ల వరకు జరిగిందని, 100కోట్లకు పైగానే షేర్ వసూలు చేసిందంటున్నారు. ఆ లెక్కలో తీసుకుంటే ఈ చిత్రం జస్ట్ హిట్ అనే చెప్పాలి.
ఇక బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' విషయానికి వస్తే ఓ తెలుగు వీరుడి జీవిత చరిత్ర కావడం, బాలయ్య నటన, క్రిష్ దర్శకత్వం వంటి వాటికి మంచి పేరొచ్చాయి. ఇక ఈ చిత్రం కలెక్షన్లపై ఇప్పటివరకు నోరు మెదపని మేకర్స్ ఈ చిత్రం 77కోట్లకు పైగానే వసూలు చేసిందని పోస్టర్స్ పైనే పబ్లిగ్గా ప్రకటించి తమ దమ్ము చాటుకున్నారు. ఇక ఈ చిత్రానికి రెండు రాష్ట్రాలలో రాయితీలు ఇవ్వడం జరిగినా, ఈ చిత్రం ప్రీబిజినెస్ కూడా బాగా జరిగిందని, కానీ ఆ స్థాయి లాభాలను మాత్రం ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు తేలేదని, ఈ చిత్రం కూడా జస్ట్ హిట్టే అంటున్నారు.
ఇక సైలెంట్ కిల్లర్‌గా వచ్చిన ఎలాంటి అంచనాలు లేని 'శతమానంభవతి' ఈ పోటీలోనూ మంచి కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం రేపటితో 50రోజులు పూర్తి చేసుకోనుంది. ఇక ఈ చిత్రం బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, సాధించిన వసూళ్లను చూసిన ట్రేడ్ వర్గాలు ఈ చిత్రమే సంక్రాంతి రేసులో నిఖార్సయిన హిట్ అంటున్నారు. ఈ చిత్రం 28కోట్ల షేర్‌ను వసూలూ చేసిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.