ఫంక్షన్ ఏదైనా సరే... పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులు మాత్రం గోల గోల చేస్తారు. వర్మ 'వంగవీటి' ఆడియో నుండి మెగాహీరోల వేడుకల వరకు ఇదే తతంగం. చిరు 'ఖైదీ నెంబర్ 150' ప్రీరిలీజ్ ఈవెంట్, బన్నీ సక్సెస్‌టూర్... ఇలా వేడుక ఏదైనా కూడా పవన్ అభిమానులు కోరుకునేది ఏమిటంటే.. తమ హీరో గురించి నాలుగు మాటలు మాట్లాడమని మాత్రమే. ఆ ఒక్కటి చేస్తే చాలు ఆయన అభిమానులు కోలాహలం చేస్తారు. ఇక ఈ తతంగం ముదిరే కొద్ది మెగాఫ్యామిలీ హీరోలు కొందరు పవన్ అభిమానులపై ఈమధ్య అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఆమధ్య ఆవేశంగా మాట్లాడాడు. బన్నీని పవన్ గురించి చెప్పమంటే 'చెప్పను బ్రదర్' అంటూ వ్యాఖ్యానించి పవన్ అభిమానుల దెబ్బకు డంగైపోతున్నాడు. ఈ వివాదం రేగి ఒక ఏడాదైనా కూడా ఇంకా అది సద్దుమణగలేదు.
పవన్ అభిమానులు నాగబాబును ఏమీ అనలేక.. బన్నీపై మాత్రం విమర్శల జోరు పెంచుతున్నారు. ఇక తాజాగా మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ఈ విషయంలో లౌక్యంగా స్పందించాడు. నాగబాబు, బన్నీలు ఆ విధంగా స్పందించారు కదా...! మరి మీరు? అని అడిగితే... 'ఎవరి అభిప్రాయం వారిది.. నేను వారి సిట్యుయేషన్‌లోకి వెళ్లి కామెంట్ చేయలేను.. వారు అలా అంటే అనుండొచ్చు.. నేను మాత్రం అలా అనలేను.. నాకు మా ముగ్గురు మావయ్యలంటే ఎంతో ఇష్టం. నేను, మా అమ్మ, నా తమ్ముడు.. ఇలా మేమందరం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి వారే కారణం' అంటూ లౌక్యంగా సమాధానం చెప్పాడు. నొప్పింపక.. తానొవ్వక తిరుగు వాడు ధన్యుడు సుమతి.. అన్న దానిని నిజం అని నిరూపించాడు.