టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు బావ, హీరో సుధీర్‌బాబు టాలీవుడ్ ప్రేక్షకులకే కాదు.. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడే. ఆయన విలన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ 'బాఘీ' బాగా ఆడకపోయిన కూడా అక్కడి ప్రేక్షకులను సుధీర్‌బాబు బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా ఆయన విభిన్న చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ఆయన కుమారుడు చరిత్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాడు. చరిత్ తాజాగా సాయిధరమ్‌తేజ నటించిన 'విన్నర్' చిత్రంలో చిన్ననాటి సాయి పాత్రను పోషించి మెప్పించాడు. ఇందులో కథకు కీలకమైన సన్నివేశాలలో చరిత్ బాగా నటించాడు. ముఖ్యంగా ఇంటి నుంచి తండ్రిపై ద్వేషంతో వెళ్లిపోయే సీన్స్‌లో ఆ పిల్లవాడు పరుగెడుతుంటే వెనుక గుర్రాలు వస్తున్నట్లుగా దర్శకుడు గోపీచంద్ మలినేని అద్భుతంగా చిత్రీకరించాడు.
అంత చిన్న వయసులో గుర్రాల ముందు పరుగెత్తడం అంటే ఎంతో రిస్క్. కానీ చరిత్ ఆ సీన్‌ని అద్భుతంగా పండించాడు. ఇదే విషయంలో ఆయన తండ్రి సుధీర్‌బాబు కూడా ఆనందంతో పొంగిపోతున్నాడు. తన కుమరుడి పరుగు అచ్చు మేనమామ మహేష్‌బాబులా ఉందని సుధీర్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి చరిత్ తన మేనమామ పోలికలను అచ్చుగుద్దినట్లుగా చిన్న వయసులోనే, ఒక విధంగా చెప్పాలంటే మహేష్ బాలనటునిగా పలు చిత్రాలలో చూపిన పెర్ఫార్మెన్స్‌నే ప్రదర్శిస్తున్నాడని ఘట్టమనేని అభిమానులు ఆనందపడుతున్నారు. ఇక చరిత్ మొదటగా మారుతి దర్శకత్వంలో నాని హీరోగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'భలే భలే మగాడివోయ్' చిత్రంలో చిన్ననాటి నానిగా అలరించాడు. ఈ బుడ్డోడి యవ్వారం చూస్తుంటే మేనమామ పేరును నిలబెట్టేలా ఉన్నాడనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తుండటం విశేషం.