చిరంజీవి 150 వ చిత్రంగా వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' కలెక్షన్స్ జాతర ముగియక ముందే చిరు 151 మూవీ గురించి చర్చ మొదలైపోయింది. చిరు రాజకీయాలపరంగా సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చి చాలాకాలం తర్వాత రాజకీయాలకన్నా సినిమాలే కరెక్ట్ అని మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి సినిమాల మీద సినిమాలు చెయ్యడానికి రెడీ అయిపోతున్నాడు. వి.వి.వినాయక్ తో 150 వ చిత్రం 'ఖైదీ....' చేసిన చిరు 151 వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తానని ప్రకటించేశాడు. ఇక ఈ చిత్రాన్నికూడా తానే నిర్మిస్తానని రాంచరణ్ కూడా అధికారిక ప్రకటన ఇచ్చేసాడు. ఇక అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రమా..కాదా అనేది మాత్రం సస్పెన్సులో పెట్టారు.
ఇకపోతే చిరు 151 చిత్రానికి కథ స్వాతంత్రం కోసం పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించే అని చెప్పకనే చెప్పేస్తున్నారు. అదెలా అంటే చిరంజీవికి దేవుడిచ్చిన తమ్ముడు శ్రీకాంత్ ఒక ఛానెల్ లో చిరు అన్న చెయ్యబోయే చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతోనే చేస్తాడని ప్రకటించేశాడు. అలాగే శ్రీకాంత్ ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫ్యామిలీతో మాటామంతి ని ఆ ఛానెల్ ప్రముఖంగా ప్రసారం చేసింది. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్నారంటే తమకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అంటే చిరు 151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అధికారింగా మెగా ఫ్యామిలీ చెప్పించినట్టే అనుకోవచ్చు.
కాగా ఇప్పటికే సిద్దంగా ఉన్న ఈ కథను ప్రస్తుతం సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ మెరుగులు దిద్దుతున్నారు. ఈ చిత్రానికి భారీ బడ్జెట్ అవసరమయ్యే అవకాశం ఉంది. దాంతో చరణ్ కూడా అందుకు తగ్గ బడ్జెట్‌ను పెట్టేందుకు, తన నిర్మాణ కెరీర్‌లోనే తన మొదటి రెండు చిత్రాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని చరణ్ భావిస్తున్నాడు. ఇక తొలి స్వాతంత్య్ర సమరానికి ముందు పదేళ్ల కిందటే ప్రస్తుత రాయలసీమకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిపై రాజీ లేని పోరాటం చేసి, తన యుద్దంతో, పరాక్రమంలో బ్రిటిష్ వారి వెన్నులో వణుకుపుట్టించాడు.
అయితే ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్‌రెడ్డి కాకుండా బోయపాటి అయితే బాగా పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయగలడని కొందరు భావిస్తుండటం విశేషం.