తన కెరీర్ ప్రారంభంలో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తనకు దేవుడు, దెయ్యాలు, జ్యోతిష్యాలువంటి వాటిపై నమ్మకం లేదని, తాను ఎక్కువగా ఖర్మ సిద్దాంతాన్ని నమ్ముతానని, తన తండ్రిలానే తన మనస్తత్వం కూడా ఉంటుందని తెలిపాడు. కుర్రతనంలో ఎక్కువ మంది అదే భావాలతో ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్ది కొన్ని నమ్మక తప్పని పరిస్థితులు తలెత్తి, నమ్మేలా చేస్తాయి. మెచ్యూరిటీ కూడా వస్తుంది. అందరిలోనూ ఇది సహజమే. ముఖ్యంగా సినిమా ఫీల్డ్‌లో మనం నమ్మకపోయినా, మన దర్శకనిర్మాతల కోసమో... మరి దేనికోసమో వాటిని ఫాలో అవుతారు. సెంటిమెంట్స్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సినిమా ప్రారంభోత్సవం రోజు కొబ్బరికాయ కొట్టే నుండి గుమ్మడికాయ కొట్టేవరకు, సినిమా రిలీజ్ విషయాలలో కూడా ఈ సెంటిమెంట్ పెరుగుతుంది.
ప్రస్తుతం నాగ్ విషయంలో ఇదే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. 'అన్నమయ్య' తర్వాత నాగ్‌లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని, ఆయనకు దైవభక్తి పెరిగిందని చెబుతున్నారు. అలాగే తన చిత్రాల విడుదల సందర్భంగా ఇటీవల తిరుమలకు రావడం, 'శ్రీరామదాసు' చిత్రం ఆడియోకు భద్రాచలాన్ని వేదికగా చేసుకొని, తన భక్తిని చాటుకుంటూనే ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఆయన తన కుమారులైన అఖిల్, నాగచైతన్యల పెళ్లి విషయంలో కూడా జ్యోతిష్యులను బాగా సంప్రదిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌లో ఓ జ్యోతిష్యుడు అఖిల్ జాతకచక్రం వేసి, అఖిల్-శ్రియభూపాల పెళ్లి వ్యవహారం సరిగా సాగదని, నిశ్చితార్దం జరిగిన తర్వాత కూడా ఎన్నో వివాదాలు వస్తాయని, పెళ్లి జరిగినా ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదని తేల్చేశాడు. యాధృచ్చికమో, నిజమో తెలియదు గానీ అనుకున్నట్లే అఖిల్ వివాహం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అయింది.
మరోపక్క అదే జ్యోతిష్కుడు నాగచైతన్య జాతకాన్ని కూడా పరిశీలించి, చైతూ జాతకంలో కూడా దోషాలున్నాయని, వీటిన్నింటికీ నివారణ పూజలు చేయాలని సెలవిచ్చాడు. ఆయన చెబుతున్నట్లే అన్ని పరిణామాలు జరుగుతుండటంతో నాగ్ ప్రస్తుతం జ్యోతిష్య పండితులతో చర్చలు, సలహాలు తీసుకుంటున్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక అఖిల్ విషయానికి వస్తే ఇంకా కెరీర్ స్దిరపడకముందే, సరిగా మీసాలు, మెచ్యూరిటీ రాకపోవడం వల్లనే ఈ పెళ్లి ఆగిపోయిందని, ఇందులో అఖిల్ తప్పే ఎక్కువగా ఉన్నాయనే వార్త హల్‌చల్ చేస్తోంది. మరి భవిష్యత్తులో ఏమి జరగనుందో వేచిచూడాలి.....!