కొత్తవారికి, ఫ్లాప్‌లలో ఉన్న వారికి కూడా అవకాశాలు ఇవ్వడంలో నాగ్‌లాగానే బాలయ్య ముందుంటాడు. విజయాలు సాధించే దర్శకుల వెనక పడటం బాలయ్యకు చేతకాదు అనేది వాస్తవమే. ఆయా ప్రయత్నాలలో ఆయనకు ఎన్నో ఎదురుదెబ్బలు కూడా తిన్నాడు. ఇక క్రిష్ వంటి దర్శకునికి తన 100వ చిత్రం అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు వరుస ఫ్లాప్‌లలో, ఆయనతో హిట్ చిత్రాలలో నటించి స్టార్స్‌గా మారిన వారు కూడా పూరీని తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ సమయంలో బాలయ్య ఆయనతో తన 101వ చిత్రం అనౌన్స్ చేయడంతో పలువురు బాలయ్య గట్స్‌ని మెచ్చుకుంటున్నారు. చిరు 'ఆటోజానీ', మహేష్ 'జనగణమన'లతో పాటు ఎన్టీఆర్ కూడా 'ఇజం' తర్వాత పూరీకి అవకాశం ఇవ్వడానికి సాహసించలేదు.
కానీ బాలయ్య ముందుకు వచ్చాడు. ఇక టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ డైలాగ్‌లకు బాలయ్యను కేరాఫ్ అడ్రస్‌గా చెప్పాలి. పూరీ చిత్రాలలో హీరోల డైలాగ్ డెలివరీ నుంచి చిన్న చిన్న పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్‌లో ఇతర దర్శకులు ఎన్నో సీన్స్‌లో చెప్పలేని పవర్‌ను పూరీ కేవలం ఒక్క డైలాగ్‌తోనే చెప్పి మెప్పిస్తాడు. దీంతో బాలయ్య, పూరీ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. బాలయ్యకు పూరీ డైలాగ్‌లు, వెరైటీ లుక్ పడ్డాయంటే ఇక రికార్డుల మోతే అంటున్నారు. అయితే బాలయ్యతో చేయబోయే చిత్రం 'ఆటోజానీ' కాదని మాత్రం స్పష్టమవుతోంది.
అయితే మహేష్‌తో చేయాలనుకున్న 'జనగణమన' చిత్రాన్ని పూరీ వెంకీతో చేయాలనుకుని రెండు మూడు రోజుల్లోనే దానికి తగ్గట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసి వెంకీని మెప్పించాడట. కానీ ఈ చిత్రం బడ్జెట్ 45కోట్లు దాటేలా ఉండటంతో వెంకీకి అది సేఫ్ ప్రాజెక్ట్ కాదని భావించిన సురేష్‌బాబు వెనక్కి తగ్గాడని, కానీ బాలయ్య, ఆయన నిర్మాతలు మాత్రం ముందుకు వచ్చారని ప్రచారం ఊపందుకుంది. ఇక ఇప్పటికే జూనియర్‌తో 'ఆంధ్రావాలా, టెంపర్' చిత్రాలు చేశాడు. కళ్యణ్‌రామ్‌తో 'ఇజం' చేశాడు. ఇప్పుడు బాలయ్యతో కూడా తీస్తే ప్రస్తుతం మంచి మనుగడలో ఉన్న నందమూరి హీరోలందరినీ డైరెక్ట్ చేసిన ఘనత పూరీకి దక్కుతుంది.