ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వారసునిగా లోకేష్‌ను ఇప్పటికే తెరపైకి తెచ్చేశారు. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా కట్టబెట్టాడు. ఇక మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి కసరత్తు ముమ్మరం చేశాడు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కొడుకును శాసనమండలికి పంపి, ఆయనకు కేబినెట్ పదవిని ఇవ్వాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా ఆయన లోకేష్‌కు ఏ మంత్రి పదవిని ఇస్తాడనే విషయాలపై పలు వార్తలు వస్తున్నాయి.
ఇక లోకేష్ విషయంలో చంద్రబాబు ఎప్పుడు కేసీఆర్, కేటీఆర్‌ల ఎత్తుగడలనే ఫాలో అవుతున్నాడు. అందుకే కేటీఆర్‌కు కేసీఆర్ తెలంగాణలో ఇచ్చిన ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖలను ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట. కేటీఆర్‌లాగే లోకేష్ కూడా మంచి విద్యావంతుడు, ఐటీపై ఎంతో అవగాహన ఉన్నవాడు కావడంతో ఆయా శాఖలనే అప్పగించాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇక ప్రస్తుతం మున్సిపల్ శాఖకు మంత్రిగా ఉన్న నారాయణ సంస్థల అధినేత నారాయణను తప్పించి ఆ పదవులనే లోకేష్ ఇవ్వనున్నాడని ప్రచారం జోరందుకుంది. ఉగాది తర్వాత జరిగే కేబినెట్ విస్తరణలో పల్లెరఘునాథరెడ్డి, పీతల సుజాత, నారాయణ, మృణాళిని, పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు వంటి వారికి ఉద్వాసన చెప్పనున్నారని తెలుస్తోంది.
కీలకమైన సమాచార, ప్రసార సినిమాటోగ్రఫీ శాఖలను గతంలో అదే శాఖలను నిర్వహించిన నెల్లూరుజిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అప్పగించవచ్చనే ప్రచారం జోరందుకుంది. మొత్తానికి ఉగాది తర్వాత మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్న పలువురు వైసీపీ, కాంగ్రెస్ వలసనాయకులకు స్థానాలు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందరూ కొత్త తెలుగు ఏడాది ఉగాది కోసమే నిరీక్షిస్తున్నారు. ఈ ఉగాది పండగ కూడా కొందరికి చేదు, మరికొందరికి తీపిని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. అయినా కేటీఆర్‌ను ఫాలో కావాలనుకున్నప్పుడు ఎవరి చేతనైనా రాజీనామా ఇప్పించి అయినా ప్రత్యక ఎన్నికల్లో లోకేష్‌ను నిలబెట్టి మంత్రి పదవి ఇస్తే విమర్శల శాతం తగ్గే అవకాశం ఉందని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.