ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ. గతంలో చిరు-పవన్‌ల మధ్య సంబంధాలు బాగాలేవనే ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన పవన్‌ను టార్గెట్ చేశారు. ఇప్పటికీ పవన్ ప్రత్యేకహోదా మీదనే మాట్లాడుతుండటాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రమంత్రులైన జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అందరూ స్పష్టం చేశారని, కానీ పవన్ అదే విషయాన్ని మరలా మరలా ప్రశ్నించడం ఏమిటని? ఆయన మండిపడ్డారు. ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేకపోయామో వివరించిన తర్వాత కూడా పవన్ అలా మాట్లాడకూడదని, వచ్చే 2019 ఎన్నికల కోసమే కొందరు ప్రత్యేకహోదాను రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాగా స్వయంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు పవన్‌కు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పాలా? అని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా కోసం ఫిరంగులకు గుండెలను ఎదురుపెట్టి నిలిచే వారు తనకు కావాలని పవన్ కోరుతున్నారని, దానికి ఎందరో యువత సిద్దంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఆంక్షలు విధించినా కూడా జనవరి 26న యువత వైజాగ్‌కు రావడమే దానికి నిదర్శనమన్నారు. ఇక సంపూర్ణేష్‌బాబుతో సహా ఎందరో యువత వైజాగ్‌కు వచ్చారని, మరి పవన్ ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు. పవన్ ప్రజల కోసం పోరాడటానికే రాజకీయాలలోకి వచ్చారని భావిస్తున్నానని, అయితే పవన్ మాటలు చెప్పకుండా ప్రత్యక్ష పోరాటంలోకి దిగితే తాము కూడా ఆయన బాటలో నడుస్తామని ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ విషయం బాగా చర్చనీయాంశం అయింది. కాగా గతంలోనే సినీజోష్ పవన్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లు పెట్టడం కాదు.. వైజాగ్‌కు ఎందుకు ప్రత్యక్షంగా రాలేకపోయారని ప్రశ్నించినందుకు పవన్ అభిమానులు ఫైర్ అయ్యారు. కాగా ప్రస్తుతం విపక్షాల నుంచి వర్మ, తమ్మారెడ్డిల వరకు ఇదే ప్రశ్నను వేసి పవన్‌ను విమర్శిస్తున్నారు. కాబట్టి ఇకనైనా పవన్ ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోవాల్సివుంది.