కుటుంబ కథా చిత్రాలను ఎంపిక చేసుకుని... ఆ కథని నమ్మి... ఆ సినిమాపై ఎంతటి బడ్జెట్ పెట్టడానికైనా వెనుకాడని దిల్ రాజు ఫ్యామిలీ చిత్రాల నిర్మాతగా పేరు పొందాడు. ఆయన వెంకటేష్, మహేష్ కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టాడు. ఇక దిల్ రాజు నిర్మించిన...సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన 'శతమానంభవతి' చిత్రం కుటుంబ కథా చిత్రంగా మలిచి ఈ సంక్రాతి బరిలో ఇద్దరు బడా స్టార్స్ చిత్రాల మధ్యన విడుదల చేసి హిట్ కొట్టాడు. అయితే ఈ 'శతమానంభవతి' చిత్రం 'ఖైదీ నెంబర్ 150' చిత్రం, 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాల మధ్యలో పడి కొట్టుకుపోతుందని అందరూ భావించారు. కానీ దిల్ రాజు నమ్మకాన్ని ఈ చిత్రం నిలబెట్టింది. కుటుంబకథా చిత్రంగా 'శతమానంభవతి' సూపర్ హిట్ అయ్యింది.
అందుకే దిల్ రాజు ఇప్పుడొక మంచి ప్లాన్ చేస్తున్నాడట. అదేమిటంటే మళ్ళీ సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో మంచి కుటుంబ కథా చిత్రాన్ని తీసి.. వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ చిత్ర కథని సతీష్ వేగేశ్న ఇప్పటికే దిల్ రాజుకి వినిపించగా దిల్ రాజు ఆ కథని ఒకే చేసి ఆ కథలో నటించడానికి నాగార్జున ని ఒప్పించే పనిలో పడ్డాడట. ఇక ఆ కథకు మంచి టైటిల్ ని కూడా దిల్ రాజు రిజిస్టర్ చేయించినట్లు వార్తలొస్తున్నాయి. ఆ కథకు సరిపోయే టైటిల్ 'శ్రీనివాస కళ్యాణం' గా ఫిక్స్ చేసారని అంటున్నారు.
అయితే నాగార్జున మాత్రం తాను ప్రస్తుతం నటిస్తున్న 'రాజుగారి గది 2' పూర్తయ్యాక తన నిర్ణయం చెప్తానని చెప్పడం తో ప్రస్తుతానికి దిల్ రాజు సైలెంట్ అయ్యాడని సమాచారం. ఇక దిల్ రాజుకి కాలం కలిసొచ్చి నాగార్జున ఈ కథకి ఒకే చెబితే మళ్ళీ సంక్రాతి బరిలో దిగి హిట్ కొట్టాలనే కసితో వున్నాడని అంటున్నారు.