అమ్మ జయ నెచ్చెలి శశికళ ఎన్నో ఆర్థిక నేరాలనే కాదు.. మాఫియా రాజకీయాలు కూడా నడిపింది. జయను, ఆమె పదవిని అడ్డుపెట్టుకొని ఎంతో సంపాదించింది. ప్రస్తుతం ఆమె జైలులో ఊచలు లెక్కబెడుతోంది. ఇక ఆమె అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని కూడా తన సొంతం చేసుకోవడానికి జైలు నుంచే పావులు కదుపుతోంది. మొత్తానికి తన అనుచరుడైన పళనిస్వామిని సీఎంను చేసింది. అయితే శశికళ ఎత్తుగడలు చూస్తే ఆమె ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఆమెకు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయాయి. జయలలిత జైలుకు వెళ్లినప్పుడు తన వీరవిధేయుడైన పన్నీర్‌సెల్వంను సీఎంని చేసింది. కానీ జయ వచ్చిన వెంటనే ఆయన ఎలాంటి నమ్మకద్రోహం చేయకుండా భక్తితో, గౌరవంతో ఆమెకే మరలా బాధ్యతలు అప్పగించాడు. అప్పుడు జయకు పన్నీర్ ఎలాగో నేడు శశికి పళని కూడా అంతే. కానీ జయకు పన్నీర్‌పై ఉన్న నమ్మకం శశికి పళనిపై లేదు. ఆమె ఈవిషయంలో అభద్రతా ఫీలవుతోంది. పార్టీని, ప్రభుత్వాన్ని కూడా తన కుటుంబం చేతిలోనే ఉంచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే జైలుకు వెళ్లే ముందే తన అక్క కొడుకు, జయ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దినకరన్‌ను కీలకపదవిలో నియమించి, పార్టీని తన హస్తగతం చేసుకోంది. ఇక ఎంతో కాలం ఆమె సీఎంగా పళనిని ఉంచే అవకాశం కూడా లేదని స్పష్టమవుతోంది. జయ మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గంకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోటీలో దినకరన్‌ను పార్టీ తరపున నిలబెట్టి, జయ స్థానం నుంచి ఆయన గెలిచేలా చేయాలని, తద్వారా భవిష్యత్తులో దినకరన్‌కు సీఎం పగ్గాలు అప్పగించి, పళనిని పక్కనపెట్టనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పలు ఆర్ధిక కేసుల్లో నిందితులైన శశి భర్త నటరాజన్, దినకరన్‌లకు కూడా త్వరలో శిక్ష పడి జైలుకు వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని సమాచారం. మరి దీనికి శశికళ ఎలాంటి ఎత్తుగడలు వేయనుందో వేచిచూడాల్సివుంది.