సినీ నటి భావన కిడ్నాప్ వ్యవహారం, ఆ తర్వాత జరిగిన విషయాలపై సృష్టిస్తున్న ప్రకంపనలు రోజు రోజుకు తీవ్రమౌతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే... ఇప్పుడు సినిమా పరిశ్రమలో ప్రతి హీరోయిన్ తమకు తాము ఆత్మ విమర్శ చేసుకొని ముందుకు అడుగు వేయాల్సిన సమయం, అవసరం ఏర్పడింది. ఈ ఘటన అలాంటి ఆలోచనను రేకెత్తిస్తుంది. ఈ ఘటన జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో అటు కోలీవుడ్ నుండి మాలీవుడ్ నుండి, టాలీవుడ్ నుండి పలువురు నటులు, నటీమణులు హీరోయిన్ భావనకు బాసటగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా భావన కు జరిగిన దుర్ఘటన తనకు ఎదురైతే ఎలా ఎదుర్కొంటారని అడుగగా తాను అటువంటి వారిని చంపేస్తానంటూ తనదైన శైలిలో డేర్ గా మాట్లాడి రకుల్ సంచలనం సృష్టించింది. తనకు అలాంటి అవకాశం ఇస్తే అలాంటి వాళ్ళను చంపేస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ ఎంతో ఆవేశంతో వ్యాఖ్యానించింది రకుల్ ప్రీత్ సింగ్.
ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ మహిళల భద్రతపై స్పందిస్తూ... నిత్యం మదర్స్ డేలు, వుమెన్స్ డేలు వంటివి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇటువంటివి జరగడం ద్వారా అలాంటి డేలకు అర్థం లేదని ఆమె వెల్లడించింది. ముందు మహిళల్ని మనుషులుగా చూద్దాం, ఆ తర్వాత వారిని గౌరవిద్దాం అంటూ రకుల్ మండిపడింది. ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. తన విషయంలో కూడా ఒకసారి ఇటువంటి ఘటనే జరిగిందని అనవసరంగా ఓ వ్యక్తి తనను మాటి మాటికీ ఫోటోలు తీస్తున్నాడని, అతడిని తాను చాచి కొట్టానని.. ఇలా చేయడం ద్వారా మానసికంగా కూడా స్ట్రాంగ్ అవుతామని ఆమె వెల్లడించింది. నిజంగా భావన విషయంలో చాలా అన్యాయం జరిగిందని, ఈ ఘటన విషయంలో దోషులను చాలా కఠినంగా శిక్షించాలని ఆమె వివరించింది.