ఫ్లాపయిన చిత్రాలన్నీ బాగా లేనట్లు కాదు. అలా ఫ్లాప్ కావడానికి ప్రమోషన్ దగ్గర నుంచి బడ్జెట్ వరకు, కాస్టింగ్ ఎంపిక నుంచి సినిమా రిలీజ్ అయ్యే సమయం వరకు ఎన్నో విషయాలపై జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. కె.విశ్వనాథ్, టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య నుండి 'అంకురం'తో మెప్పించిన ఉమామహేశ్వరరావు, 'రక్షణ'తో తన టాలెంట్ చూపిన ఉప్పలపాటి నారాయణ రావు వరకు ఎందరో ఫ్లాప్‌లు రుచిచూసి, తెరమరుగై ఉండవచ్చు... కానీ వారు భావితరాలు గొప్పగా చెప్పుకొని, ప్రశంసలు కురిపించిన చిత్రాలను అందించారు. కాగా తెలుగులో ఉన్న నేటి వారిలో మంచి టాలెంటెడ్ దర్శకుడు దేవకట్టా. ఆయన తీసిన 'ప్రస్థానం' గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిత్రం అవార్డుల పంట పండించింది.
రెండు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం తమ కెరీర్‌లో మైలురాయిగా సాయికుమార్, శర్వానంద్‌లు కూడా ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు. అయితే దేవకట్టా తీసిన 'ఆటోనగర్ సూర్య' వంటివి ఫ్లాప్ కావడంతో ఆయనకు అవకాశాలు రావడం లేదు. 'ఆటోనగర్ సూర్య' ఫ్లాప్‌కు కేవలం దేవకట్టానే బాధ్యుడిని చేయలేం. ఈ చిత్రం విషయంలో నిర్మాతలు చాలా చాలా తప్పులు చేశారు. ఇక ఇప్పుడు దేవకట్టాకు మరోసారి తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చింది. 'ప్రస్థానం' గురించి కాస్త ఆలస్యంగా తెలుసుకున్న 'ఖల్‌నాయక్' సంజయ్‌దత్ ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నాడు. ఇందులో సాయికుమార్ పోషించిన నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రను ఏకంగా ఎంతో స్టార్ ఇమేజ్ ఉన్న సంజయ్‌దత్ చేయడానికి ముందుకు రావడం హర్షణీయం. ఇక ఈ చిత్రంలో నటించబోయే కుర్రహీరోల కోసం అన్వేషణ సాగుతోంది. కాగా ఈ చిత్రాన్ని హిందీలో కూడా దేవకట్టానే దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. మరి ఇది దేవకట్టాకు చాలా అరుదైన అవకాశమనే చెప్పాలి. బాలీవుడ్ ప్రేక్షకులు ఇలాంటి వైవిద్యభరితమైన చిత్రాలను బాగా ఆదరిస్తారు. అవార్డులతో పాటు రివార్డులు కూడా ఇస్తారు మరి ఈ చిత్రమైనా దేవకట్టా వంటి టాలెంటెడ్ డైరెక్టర్‌కు మంచి కెరీర్‌ను ఇస్తుందో లేదో వేచిచూడాల్సివుంది.