హీరోగా నాగార్జున, దర్శకునిగా రాఘవేంద్రరావులు అత్యంత ప్రతిభావంతులు. వారికి సినిమాలోని అన్ని రంగాల్లో మంచి పట్టుంది. తాజాగా వీరి కాంబినేషన్‌లో హథీరాంబావాజీ జీవితచరిత్ర ఆధారంగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం చేశారు. దీంతో ఈ చిత్రం కూడా 'అన్నమయ్య' రేంజ్‌లో ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు రావడం లేదు. 'అన్నమయ్య శ్రీరామదాసు' వంటి చిత్రాల సీడీలు, డీవీడీలు, ఆడియోలు తమ స్వంత లైబ్రరిలో పెట్టుకున్న వారు ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఓవర్‌సీస్‌లోని ప్రవాసాంద్రులు కూడా ఎందరో ఉన్నారు. మరి అలాంటి ప్రేక్షకులు ఉండే ఓవర్‌సీస్‌లో కూడా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రానికి కలెక్షన్లు లేవంటే కాస్తైనా ఆలోచించాలి. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు ఎంతో బాగా తీశాడు. నిర్మాతలు భక్తిభావంతో ఖర్చుకు వెనుకాడకుండా బడ్జెట్‌ను కేటాయించారు. ఇక నాగ్ అయితే తన నటనా విశ్వరూపం చూపించాడు. నిజమే.. దీన్ని ఎవరు కాదనడం లేదు. కానీ ఈ చిత్రాన్ని ఆదరించకపోవడం ప్రేక్షకుల తప్పుగా చాలా మంది భావిస్తున్నారు. చివరకు బ్రహ్మానందం సైతం మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని లాభాల కోసం తీయలేదు. భక్తితో తీశారు. మంచి సినిమాలు రావడం లేదు... అనకుండా అలా తీసిన మంచి చిత్రాలను ప్రోత్సహించండి.. అని చెప్పారు. ఇది నూటికి నూరు శాతం నిజం. కానీ గతంలో రాఘవేంద్రరావు, నాగార్జునలు చేసిన తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోలేదని ఈ చిత్రం చూసిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
'శిరిడీ సాయి' చిత్రంలో అనవసర కామెడీ, సినిమా డాక్యుమెంటరీలాగా ఉండటంతో బాగా ఆడలేదని నాగ్ ఆమధ్య చెప్పుకొచ్చారు. ఇది నిజం. మరి అదే తప్పును కూడా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో చేశారు. అనవసర కామెడీని, ఇతర మాస్ అంశాలను చేర్చి సినిమాటిక్‌గా తీసే ప్రయత్నం చేశారు. ఇక రాఘవేంద్రరావు.. బాలకృష్ణతో తీసిన 'పాండురంగడు'లో టబును మరీ హద్దులు మీరి చూపించారు. ఫలితంగా ఆ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులకు దూరమైంది. అదే తరహాలో సినిమాటిక్‌గా అనే పదాన్ని వాడుకొని 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో ఎన్నో తప్పులు చేశారు. ప్రగ్యాజైస్వాల్‌పై పాటలో మొదట పండ్లు, పూలు, బొడ్డు, నడుము వంటివి దర్శకుడు చూపించదలుచుకోలేదని, కానీ తానే పట్టుబట్టి అలా తీయమని రాఘవేంద్రరావును బతిమాలినట్లు ప్రగ్యాజైస్వాల్ స్వయంగా ఒప్పుకుంది. 'అన్నమయ్య'లో కూడా మరదళ్లతో సరసాన్ని, మోహన్‌బాబు, రోజాల మధ్య వచ్చే పాటను రసికత ఉట్టి పడేలా తీసినా కూడా శృంగారం, అందాల ఆరబోత కనిపించాయనే విమర్శలు రాలేదు. ఇక 'అన్నమయ్య'లో ఆయన కీర్తనలు కాపీ కొట్టారా? లేదా? అనే వాదన కంటే 'అన్నమయ్య, శ్రీరామదాసు' ల స్థాయిలో ఈ చిత్రం మ్యూజికల్‌గా మెప్పించలేకపోయింది. పాటల్లోనే భక్తి భావాన్ని ఒలికించడంలో కీరవాణి సక్సెస్ కాలేదు. ఇక ఈ చిత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా నటించిన బుల్లితెర నటుడు సౌరభ్ పరభాషానటుడు కావడంతో ఆయనలో మన ప్రేక్షకులకు భక్తిభావం కనిపించలేదు. అదే సుమన్ చేసి ఉంటే బాగుండేదని కూడా విమర్శలున్నాయి.
ఇక 'అన్నమయ్య' సమయంలో విజయానికి మూలస్తంభంగా నిలిచిన సుమన్ గురించి యూనిట్ అసలు మాట్లాడకపోవడం, ఆయనను పొగడ్తలకు దూరం చేసిన విషయంలో యూనిట్ తప్పు చేసింది. ఇక ఈ చిత్రంలో సుమన్‌ను వేంకటేశ్వరస్వామిగా పెట్టుకోకపోవడానికి యూనిట్ చెబుతున్న వంక చూస్తే నవ్వు రాక మానదు. వేంకటేశ్వరస్వామి నిత్యయవ్వనుడు కాబట్టి వయసు మీద పడటం వల్ల సుమన్‌ను తీసుకోలేకపోయామని అర్ధం వచ్చేలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అదే నిజమైతే 'అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమో వేంకటాశాయ' చిత్రాలలో కూడా కుర్రవాడిగా, యువకునిగా నాగ్‌ని చూపించినప్పుడు ఆయన మొహంలో పెద్దవయసు ఛాయలు కనిపించలేదా? అనేది అసలు ప్రశ్న. ప్రస్తుతం మరలా నాగ్, రావు లు ఇలాంటి తప్పులు చేసి, తమ సినిమాను ఆదరంచడం లేదని ప్రేక్షకులను తప్పుపట్టడం తగదు. అయితే ఒక్కటి మాత్రం నిజం.. వీరు మంచి ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఎందుకు ఏ సినిమా హిట్ అవుతుందో? ఎందుకు హిట్ కాదో ఎవ్వరూ చెప్పలేరు. అందరూ విజయం సాధించడానికే కష్టపడి చిత్రాలు తీస్తారు. అలాగే ప్రేక్షకులు కూడా మంచి చిత్రాలు వస్తే పట్టం కట్టాలనే ఉంటారు. కానీ ఆ అభిరుచిలో ఏమైనా కాస్త తప్పు కనిపిస్తే మాత్రం శిక్షిస్తారు.. ఇదే ఫైనల్ డెసిషన్ అంటారు.