అనాదిగా సమాజంలో మహిళల పట్ల చిన్నచూపు ఉన్న విషయం వాస్తవమే. వారు అణగదొక్కబడిన మాట కూడా నిజమే. ప్రస్తుతం వారికి కూడా సమానావకాశాలు వస్తున్నాయి. మహిళల స్వేచ్చ గురించి, లైంగిక స్వేఛ్చ గురించి మాట్లాడటం కూడా తప్పుకాదు. ఫెమినిస్టులను ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ ఇక్కడ చాలా మంది మహిళాసానుభూతిపరులు తమ స్వార్ధం కోసం కొన్ని విషయాలలో రెచ్చిపోతున్నారు. బుల్లితెరపై మహిళలను విలన్లుగా చూపించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. అంటే విలన్లంటే కేవలం పురుషులేనా..? మహిళల్లో చెడ్డ లక్షణాలు ఉన్న వారు లేరా? కొత్తగా వచ్చిన ఎంత మంది కోడళ్లు తమ అత్తమామలను రాచిరంపాన పెట్టడం లేదు? అత్త కూడా తోటి ఆడదే కదా...! అటు భార్యకు, ఇటు తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక నలిగిపోతున్న ఎందరో మగాళ్లున్నారు. కనీసం అమ్మాయిలను సంప్రదాయ దుస్తులు వేసుకోండి అని చెప్పినా కూడా పెడార్ధాలు తీస్తున్నారు. మరి పురుషులు సంప్రదాయ దుస్తులైన పంచె, లుంగీలు కడుతున్నారా? అని వితండవాదం చేసే వారి గురించి మనం మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ వ్యవహారం. మంచి చెప్పినా పెడార్ధాలు తీసే వారి విషయంలో మనమేమీ చేయలేం.
ఇక గతంలో ఉన్నట్లుండి తనది తెలంగాణ అన్ని తెలుసుకున్న రాములమ్మ విజయశాంతి రాజకీయ ప్రస్ధానం, ఆమె ఏ పార్టీలను ఎందుకు వీడారు? సొంత పార్టీ ఏమైంది? అనే విషయాలను చెప్పుకోకపోవడమే మంచిది. ఇక్కడ సిద్దాంతాలు నచ్చనప్పుడు వేరే పార్టీలలోకి వెళ్లడం... సొంతగా పార్టీని స్థాపించడం.... వీటిని ఎవ్వరూ తప్పుపట్ట కూడదు. కానీ అవకాశ రాజకీయాలు చేసి సొంత పార్టీలను పెట్టి, ఆ తర్వాత చిరు లాగా వేరే పార్టీలలో తమ పార్టీని విలీనం చేసే వారిని, అవకాశరాజకీయాలకు పాల్పడే వారిని మాత్రం తప్పుపట్టాల్సిందే. ప్రస్తుతం తమిళనాడులో ప్రజలు ఎవరివైపు ఉన్నారో అందరికీ బాగానే తెలుసు. మన రాములమ్మకు జయలలిత స్ఫూర్తి అనేది కూడా వాస్తవమే. అంతమాత్రాన ఆమె శశికళను సపోర్ట్ చేయాల్సిన పనిలేదు. శశికళకు మద్దతు తెలపడం కూడా తప్పుకాదు. ఇది ప్రజాస్వామ్యం. కానీ ప్రజల మనోభావాలకు విరుద్దంగా కేవలం తోటి మహిళ అనో, తనకు మంచి పరిచయం, దోస్తీ ఉన్న వ్యక్తి అనో రాములమ్మ.. శశికళను సమర్ధించడాన్ని మాత్రం తప్పుపట్టాలి. శాంతియుతంగా పార్టీని సంఘటితం చేస్తోన్న చిన్నమ్మకే తన మద్దతు అని, కానీ పార్టీని చీల్చడానికి పన్నీర్‌సెల్వం దుష్టశక్తులతో అల్లకల్లోలం చేస్తున్నారని రాములమ్మ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో కూడా పన్నీర్‌సెల్వం చాలా హుందాగా వ్యవహరించారు. డీఎంకే సభ్యులు గొడవ చేసినా కూడా పన్నీర్ మౌనంగా ఉన్నారే గానీ మరేమీ చేయలేదు. మరి శశికళనే సీఎం కావాలని రాములమ్మ పేర్కొనడాన్ని చూస్తే అది అమె రాజకీయ అవగాహనా రాహిత్యమా? లేక అవకాశ వాదమా? అనేది అర్థం కావడం లేదు. విజయశాంతి, శశికళ వంటి వారు నిజమైన మహిళా పక్షపాతులు కాదని, వారి పబ్బం గడుపుకోవడానికే ఇలా ప్రవర్తిస్తూ, మహిళలకు తలవంపులు తెస్తున్నారని చెప్పవచ్చు. అయినా మహిళల ప్రాతినిధ్యం రాజకీయాలలో పెరుగుతోందని మనం చంకలు గుద్దుకోవడం కాదు. మహిళల మాటున తండ్రులు, భర్తలు, కొడుకులు షాడోలుగా పనిచేస్తూ మహిళలను కీలుబొమ్మలను చేస్తున్నారనేది వాస్తవం అవునా? కాదా?