జనసేన పార్టీని స్థాపించి, కుల మత రాజకీయాలకు దూరంగా పాలిటిక్స్ చేయాలని భావిస్తోన్న జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌కు మరో కీలకవ్యక్తి నుంచి తాజాగా బహిరంగ మద్దుతు లభించింది. వాస్తవానికి పవన్‌కు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అంటే మొదటి నుంచి ఎంతో గౌరవం ఉంది. గత ఎన్నికల్లో పవన్.. జెపి తరపున ఆయన నిలబడిన నియోజకవర్గంలో ప్రచారం చేయాలని ఉందని కూడా బహిరంగంగానే తెలిపాడు. కానీ నాడు బిజెపి-టిడిపి కూటమికి మద్దతునిచ్చిన కారణంగా ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మిత్రధర్మం కాదని భావించారు. అందుకే ఆయన గత ఎన్నికల్లో జెపి తరపున ప్రచారం చేయలేదు. ఇక తాజాగా లోక్‌సత్తా అధినేత జెపి పవన్‌కు మద్దతు ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దేశ రాజకీయాలు బాగుపడాలని, మంచి జరగాలని కోరుకునే వారు, సమాజం బాగుండాలని ఆశించే వారందరి మనోభావాలు ఒకేలాగా ఉంటాయని వ్యాఖ్యానించారు. తాను జనసేనలో చేరుతానా? లేదా? అనేది ముఖ్య అంశం కాదన్నారు. పవన్ భావాలతో తనకు భావసారూప్యత ఉన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అలాంటి ఆలోచనావిధానం ఉన్న వారందరికీ తన మద్దతు ఉంటుందని కీలకవ్యాఖ్యలు చేశారు. తన సలహాలు, సూచనలు పవన్‌కి కావాలనుకుంటే తాను అందిస్తానని తెలిపాడు.
కానీ ఇక్కడ ఓ విషయం మనం గమనించాలి. జెపి మంచి భావాలున్న వ్యక్తే గానీ ఆయనకు కూడా కులం పిచ్చి బాగానే ఉందని ఆయనను దగ్గరగా చూసిన వారు వ్యాఖ్యానిస్తారు. జెపి పక్కన ఉండే వారే దానికి ప్రధాన కారణమనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక సమైక్యాంధ్ర విషయంలో, తెలంగాణ విభజన వంటి వాటిపై నాటి అసెంబ్లీలో జెపి కీలకవ్యాఖ్యలు చేశారు. కానీ ఆ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆయనపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. దాంతో ఆయన అప్పటికప్పుడు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని మాట మార్చారు. తన మనోభావాలను అణిచిపెట్టి తన పంథా మార్చుకున్నారు. అలాంటి పిరికి వారు ఎప్పుడు ఓ కేజ్రీవాల్ కాలేరు అనేది జెపి ఇప్పటికైనా గమనిస్తే మంచిది. ఇక పవన్ గురించి తెలుసుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తాము పంజాబ్‌లో సాధించబోయే ఫలితాలను చూసి, జనసేనాధిపతితో భేటీ కావాలని భావిస్తున్నాడని సమాచారం.