ఒకప్పుడు తమిళనాట కమల్ హాసన్.. అమ్మ జయలలితని తీవ్రంగా వ్యతిరేకించేవారు. అసలు జయకు కూడా కమల్ హాసన్ అంటే పడేది కాదు. అందుకే జయ, కమల్ సినిమాల విడుదల సమయంలో అడ్డంకులు సృష్టించేదని అందరూ బహిరంగంగానే మాట్లాడేవారు. ఇక కమల్ కూడా జయలలిత విషయంలో బహిరంగ విమర్శలు చేసి చాలా నష్టపోయాడు. తన సినిమాలను విడుదల చేసుకోలేక ఆఖరుకి తన సొంత ఇల్లుని తాకట్టు పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు కమల్. అయినా ఎప్పుడూ కమల్, జయకి లొంగి లేడనేది అందరికి తెలుసు.
ఇక ఇప్పుడు మళ్లీ జయ నెచ్చెలిని రాజకీయాల్లో హైలెట్ చెయ్యడం నచ్చక కమల్ శశికళపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. జయ మరణం తర్వాత తమిళ రాజకీయాలపై ట్వీట్స్ తో విరుచుకుపడుతున్న ఈ హీరోగారు పన్నీర్ సెల్వం నాయకత్వంలో తమిళనాడులో రాజకీయ పరిస్థితులు చక్కబడతాయని ఓపెన్ గా చెప్పేసాడు. ఇక శశికళ సీఎం రేసులో ఉన్నంతసేపు ఆమెని విమర్శిస్తూ శశికళ చేతిలో గనక తమిళనాడుని పెడితే తమిళులు చాల బాధపడాతారని చెప్పాడు. కమల్ ట్వీట్స్ సంగతి ఎలా వున్నా ఇప్పుడు శశికళ చేతిలోనే తమిళ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయనేది ఆమె నియమించిన పళని స్వామి సీఎం అయ్యాక అర్ధమై ఉంటుంది. పళని స్వామి తమిళ సీఎంగా శశి చెప్పినట్టు చేయాల్సిందే. ఇక పళని శశికళ చేతిలో కీలుబొమ్మ గా పని చెయ్యాల్సిందే అనేది జగమెరిగిన సత్యం.
మరి కమల్, శశికళని బహిరంగంగా విమర్శించి మళ్లీ కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడని అందరూ అభిప్రాయపడుతున్నారు. మళ్లీ కమల్, జయ చేతిలో దెబ్బతిన్నట్టే ఇప్పుడు శశి చేతిలో కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఒక్క కమల్ హాసన్ మాత్రమే కాకుండా తమిళ స్టార్స్ అంతా పన్నీర్ సెల్వానికే మద్దతు ప్రకటించి శశికళ వర్గాన్ని విమర్శిస్తూ ఆమె పాలనను వ్యతిరేకించిన వారిలో వున్నారు. మరి వీరందరికి శశికళ నుండి తిప్పలు తప్పవని అంటున్నారు. చూద్దాం ఇకపై తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో.