ఈటీవీలో ప్రసారం అవుతోన్న 'జబర్దస్త్' కామెడీ షో ఎంతగా పాపులరో వేరేగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో వల్ల ఈటీవీకి రేటింగ్స్ అద్భుతంగా వస్తున్నాయి. దీన్ని అడ్డుకోవడానికి ఎవరు ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా కూడా ఈ షోకి పెరుగుతున్న ఆదరణను ఆపలేకపోతున్నారు. ఇక ఈ షో ఇంతగా విజయవంతం కావడానికి ఈ స్కిట్స్‌లో నటించే వారితో పాటు జడ్జిలైన నాగబాబు, రోజాల పాత్ర, యాంకరింగ్ చేస్తోన్న అనసూయ, రేష్మిల హవా కూడా దీనికి తోడవుతోంది.
కాగా ఈ స్కిట్స్‌లో పలువురిని కించపరుస్తూ , ఆత్మగౌరవాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ ఎన్నో ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఆమద్య స్వర్గీయ ఎన్టీఆర్‌పై చేసిన స్కిట్‌లో ఆయన్ను వ్యంగ్యంగా చూపించారని బాలయ్యతో పాటు పలువురు ఆగ్రహించారు. కాగా అప్పుడెప్పుడో ఈ స్కిట్‌లో న్యాయస్థానాలను, జడ్జిలను, న్యాయవాదులను అపహాస్యం చేశారని ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. ఇందులో నాగబాబు, రోజా, అనసూయ, రేష్మిలతో పాటు స్కిట్‌కి సంబంధించిన వారిని కూడా ప్రతినిందితులుగా చేర్చారు. దీనిపై నాగబాబు తదితరులు హైకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన న్యాయమూర్తి తీర్పునిస్తూ వారి ప్రోగ్రాంలో అలాంటి స్కిట్స్ వల్ల ప్రజలకు, కోర్టుకు వచ్చేవారికి చిన్నచూపు వస్తుందని, వారు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉండటంతో ఇలాంటివి పునరావృతం కాకుండా స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు. మొత్తానికి శిక్షించకపోయినా కూడా ఘాటు విమర్శలు మాత్రం ఈ షో వారికి తప్పలేదు.
కాగా ప్రస్తుతం స్టార్ నెట్‌వర్క్‌లోకి వచ్చిన మా టీవీ వారు 'జబర్దస్త్'ని మించిన షో చేయాలని, అందుకోసం సరికొత్త ఆలోచనలతో త్వరలో 'దేశముదుర్లు' అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసి 'జబర్దస్త్'ను, ఈటీవీని అధిగమించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో గతంలో 'జబర్దస్త్' లో పాల్గొన్న కమెడియన్లు వేణు, ధన్‌రాజ్‌లతో పాటు జడ్జిగా నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళిని తీసుకున్నారు. మరి ఈ 'దేశముదుర్లు' ప్రోగ్రామైన 'జబర్దస్త్'ని బీట్ చేస్తుందేమో చూడాలి..! అయినా కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ వల్ల షోలకు మరింత కొత్తదనం, హుందాతనం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.