దేశంలో మేథావులు ఎందరో ఉన్నారు... సామాన్య ప్రజల మౌనం కంటే మేథావుల మౌనం చాలా ప్రమాదకరం అని ఎప్పడి నుండో ఎందరో హెచ్చరిస్తున్నారు. ఇక మన దేశంలోని ప్రస్తుత మేథావుల విషయానికి వస్తే.. రాంజెఠ్మలానీ... నుంచి సుబ్రహ్మణ్యస్వామి వరకు చాలా మంది ఉన్నారు. కానీ రాంజెఠ్మలానీ నుంచి ఎందరో తన సంపాదన కోసమో.. లేక అధికారంలోని వారికి చెడ్డ కావడం ఎందుకు అనుకుంటూ, మౌనంగా ఉండటమే కాదు.. ఎంత అవినీతిపరులైన వారిని కూడా తమ మేథస్సుతో నిర్ధోషులుగా నిలుపుతున్నారు. స్వయాన రాంజెఠ్మలానీపై అలాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. కానీ సుబ్రహ్మణ్యస్వామిది మాత్రం ప్రత్యేక పంథా.. ఆయనను కూడా కొందరు బ్లాక్‌మెయిలర్ అని అంటుంటారు.
అందులో కొంత వాస్తవమే ఉన్నా కూడా కొన్నిసార్లు.. కొందరి విషయంలో ఆయన చేసే పనులు వావ్.. అనిపిస్తాయి. అందరిపై పనికిమాలిన ఆరోపణలు చేసి ఆ తర్వాత మౌనంగా ఆయన ఉండడు. ఆధారాలతో సహా ఎవరినైనా విమర్శిస్తాడు.. వారికి కలలో కూడా సింహస్వప్నంగా నిలుస్తాడు. జయలలిత, శశికళల అసలు స్వరూపాన్ని బయటపెట్టి కోర్టులో వారి ఓడిపోయే వరకు కృషి చేశాడు. ఇక 2జి స్కాం విషయంలో నాటి కేంద్రమంత్రి, డీఎంకెకు చెందిన రాజా, కనిమొళి వంటి వారు పని చూశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, రాబర్ట్ వాద్రాలతో పాటు ఎందరినో ముప్పుతిప్పలు పెట్టాడు. కొన్ని విషయాలలో ఆయన కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికీ అది కేవలం బలమైన ఆధారాలను సేకరించేందుకు మాత్రమే. న్యాయకోవిదుడు, ఆర్ధికవేత్త కూడా అయిన ఆయన గతంలో కేంద్రమంత్రిగా పనిచేసినప్పటికీ, ప్రస్తుతం ఆయనకు మంత్రి పదవి లేకపోయినా, కేవలం రాజ్యసభ ఎంపీ అయినా కూడా ఆయన ఎవ్వరినీ వదలడం లేదు.
ముఖ్యంగా తన రాష్ట్రమైన తమిళనాడులో ఆయనంటే ఒణుకు. కనీసం అలాంటి వారు రాష్ట్రానికి ఒక్కరు ఉన్నా కూడా వారిని చూసి అవినీతి చేసేవారు భయపడతారు. ప్రస్తుతం మన రాష్ట్రం విషయానికే వస్తే ప్రతిపక్ష నేత జగన్‌పై, అధికార పక్షంలోని పలువురు నేతలపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. భగవంతుడా...! మనకు కూడా ఓ సుబ్రహ్మణ్య 'స్వామి' వంటి వారిని ఇవ్వు అని ఆ దేవుడిని ప్రార్ధించాలి.