మార్చి నెలాఖరు నుంచి 'కాటమరాయుడు'తో పాటు పలు పెద్ద చిత్రాలు పోటీకి రెడీ అవుతున్నాయి. దీంతో ఆలోపే తమ చిత్రాలను విడుదల చేయాలని నిర్మాతలు రెడీ అవుతున్నారు. మార్చినెల అంటే అన్‌సీజన్. పిల్లలు, విద్యార్ధుల చదువు, పరీక్షల హడావుడి సమయం ఇది. అయినా కూడా ఈమధ్య మన దర్శనిర్మాతలు, హీరోలలో ధైర్యం పెరిగిపోతోంది. సినిమాలో విషయం ఉంటే ఆడుతుందని భావిస్తూ డేర్ చేస్తున్నారు. ఇదే క్రమంలో మార్చినెలలో పలు చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా మార్చి 3వ తేదీన దాదాపు అరడజను చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. రాజ్‌తరుణ్ హీరోగా 'దొంగాట' ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' పై మంచి అంచనాలున్నాయి.
ఇందులో రాజ్‌తరుణ్ కుక్కల కిడ్నాపర్‌గా విభిన్న పాత్ర పోషిస్తూ ఎంటర్‌టైన్ చేయడానికి వస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌తో పాటు వరుసగా విడుదవుతున్న పాటలకు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్‌సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్రంలోని 'జానీ.. జానీ..ఎస్ పాపా.. డ్రింకింగ్ ఓడ్కా నో పాపా...' అనే పాట చాలా బాగుంది. అనూప్‌రూబెన్స్ అందించిన ట్యూన్‌తో పాటు ఈ పాటలోని లిరిక్స్ ఎంతో ఫ్రెష్‌గా, లవ్ లీగా ఉన్నాయనే ప్రశంసలు లభిస్తున్నాయి.
కాగా ఈ పాటకు రాజ్‌తరుణే లిరిక్స్ అందించడం విశేషం. ఇక అదే రోజున మంచు మనోజ్ 'గుంటూరోడు' విడుదల కానుంది. ఇందులో మనోజ్ సరసన ప్రగ్యాజైస్వాల్ నటిస్తోంది. ఆర్.బిచౌదరి సమర్పణలో 'పెళ్లిచూపులు'తో ఆకట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'ద్వారకా' కూడా అదే రోజున రిలీజ్ అవుతోంది. ఎంతో కాలంగా విడుదలకు నోచుకోని అంజలి 'చిత్రాంగధ', సురేష్‌కొండేటి అందిస్తున్న అనువాద చిత్రం 'మెట్రో'లతో పాటు మరో రెండు చిత్రాలు అదేరోజున విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.