సంచలన, వివాదాస్పద దర్శకుడు వర్మ. ఆయన తీసే చిత్రాల ఇతివృత్తాలే వివాదాలకు కేంద్రబిందువు అయ్యేలా, ప్రీపబ్లిసిటీ లభించేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. గతంలో ఆయన తమిళనాడు రాజకీయాలపై ట్వీట్ చేస్తూ, ఒకప్పుడు 'శశికళ' అనే చిత్రం తీస్తానని ప్రకటించిన ఆయన అదే మాటలను మరలా చెప్పుకొచ్చాడు. జయలలితకు, శశికళకు మధ్య ఉన్న బంధానికి కారణం ఏమిటి? అనేది పోయెస్‌గార్డెన్‌లో పనిచేసే పనిమనుషుల ద్వారా తెలుసుకున్నానని, మన్నార్‌మాఫియా గురించి చాలా విషయాలు ట్వీట్ చేశాడు. కాగా ప్రస్తుతం వర్మ అమితాబ్‌తో 'సర్కార్ 3' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్7 వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. దీని తర్వాత తాను నాలుగేళ్లపాటు 'న్యూక్లియర్' అనే భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంటానని, వచ్చే తమిళనాడు ఎన్నికలప్పుడు శశికళ చిత్రం తీస్తానని గతంలో తెలిపాడు. కానీ ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఉత్కంఠ పరిస్థితులను ఉపయోగించుకొని, 'న్యూక్లియర్'కి ముందే 'శశికళ' చిత్రం తీసి, క్యాష్ చేసుకోవాలని వర్మ భావిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
గతంలో కూడా ఆయన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత 'రెడ్డిగారు పోయారు' అనే సినిమా అనౌన్స్ చేసినప్పటికీ ఆ చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. ఇక ఆ సందర్భంలో కూడా ఆయన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి, అతని ఆత్మ అయిన కెవిపి రామచంద్రరావుల మధ్య ఉన్న బంధానికి కారణం చెబుతానని హడావుడి చేశాడు. ప్రస్తుతం అదే మాట జయ-శశిల విషయంలో చెబుతున్నాడు. కాగా జయకు శశికళకు లెస్బియన్స్ అనే పేరుందని చాలా మంది భావిస్తారు. గతంలో ఓ గుడికి ఇద్దరు వెళ్లిన సందర్బంగా ఈ ఇద్దరు పూల దండలు సైతం మార్చుకొని సంచలనం సృష్టించారు. జయ యుక్తవయసులో ఉన్నప్పుడు పెళ్లి పేరుతో ఎందరో మోసం చేశారని, దాంతో ఆమె మగద్వేషిగా మారిందని, దానిని శశికళ క్యాష్ చేసుకుందనే వాదన కూడా ఉంది. మరి ఇలాంటి అంశాలనే వర్మ చూపించనున్నాడా? అది సాధ్యమేనా? తమిళ ప్రేక్షకులు ఒప్పుకుంటారా? లేక ప్రచారానికి ఎక్కువ విలునిచ్చే వర్మ అందులో భాగంగానే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నాడా? అనే పలు సందేహాలను ఎందరో వ్యక్తం చేస్తున్నారు.