తెలుగులో అతి తక్కువ చిత్రాలతోనే దర్శకధీరునిగా మారిన రాజమౌళిని ఎందరో స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. చాలా మంది యువదర్శకులకే కాదు.. ఆయన సమకాలీకులకు కూడా ఆయన రోల్‌మోడల్‌గా మారుతున్నాడు. ఇక మొదటి నుంచి జక్కన్నకు విలక్షణ దర్శకునిగా పేరు తెచ్చుకుంటున్న క్రిష్‌తో మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే జక్కన్న సైతం తాజాగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి తన వంతు ప్రమోషన్ చేసిపెట్టాడు.
ఇప్పుడు క్రిష్ కూడా జక్కన్న తరహాలోనే తనకంటూ ఓ కొత్త ఇమేజ్ తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళికి 'యమదొంగ' సమయంలో టెక్నాలజీ అనే దోమ కుట్టింది. దాంతో ఆయన ఇక వరుసగా ఆ కోవ చిత్రాలనే చేస్తున్నాడు. తనకంటూ ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. మధ్యలో ఆయన తీసిన 'మర్యాదరామన్న' చిత్రం మినహా మిగిలినవన్నీ ఆయన గ్రాఫిక్ వండర్స్‌ను, విజువల్ వండర్స్‌ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తూ విజయం సాధిస్తున్నాడు ఇక 'బాహుబలి-ది బిగినింగ్'తో ఆయన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. త్వరలో విడుదల కానున్న 'బాహుబలి- ది కన్‌క్లూజన్'చిత్రంలో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఆయన అదే దారిలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక క్రిష్ విషయానికి వస్తే ఆయన మొదటి చిత్రం 'గమ్యం' నుంచి అన్ని విభిన్న చిత్రాలనే చేస్తున్నాడు. ఇక వరుణ్‌తేజ్‌తో చేసిన 'కంచె' చిత్రంతో చారిత్రక నేపథ్యం ఉన్న కథలవైపు తన మనసును మళ్లించాడు. తాజాగా బాలయ్యతో అతి తక్కువ సమయం, అతితక్కువ బడ్జెట్‌తోనే ఆయన తెరకెక్కించిన చారిత్రక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన చారిత్రక నేపథ్యం ఉన్న బయోపిక్స్‌పై దృష్టి పెడుతూ, చరిత్రను తిరగేస్తున్నాడు. 'శ్రీకృష్ణదేవరాయ'; 'గౌతమ బుద్ద' వంటి చారిత్రక చిత్రాలపై రీసెర్చ్ చేస్తున్నాడు. మొత్తానికి క్రిష్ కూడా జక్కన్న తరహాలో తనకంటూ కొత్త ట్రెండ్‌ను సృష్టించుకొని, చారిత్రక చిత్రాలనే విజువల్ వండర్స్‌గా తీయాలని పట్టుదలతో ఉన్నాడు. దీంతో ఇకనుంచి ఆయన నుంచి మిగిలిన రెగ్యులర్ విభిన్న చిత్రాలు రావా? అనే అనుమానం కలుగుతోంది.