చిరంజీవి కామ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' లో చిరు పక్కన నటించే హీరోయిన్ కోసం పెద్ద వేటే సాగింది. చిరు పక్కన నటించడానికి ఏ హీరోయిన్ అయితే బావుంటుందో అని చిత్ర నిర్మాత రామ్ చరణ్ దగ్గరనుండి చిత్ర యూనిట్ వరకు చాలా కష్టపడింది. ఇక ఎట్టకేలకు కాజల్ అగర్వాల్ ని చిరంజీవికి జోడిగా ఎంపిక చేసి సక్సెస్ సాధించిన చరణ్ ఇప్పుడు తన తండ్రి 151వ చిత్రానికి కూడా హీరోయిన్ కోసం అలాంటి వేటనే కొనసాగిస్తున్నాడట. అయితే 'ఖైదీ.....' చిత్రం మొదలయ్యి చాలాకాలం అయ్యేవరకు హీరోయిన్ ని ఫైనల్ చెయ్యలేకపోయింది చిత్ర యూనిట్. షూటింగ్ మొదలు పెట్టిన చాలా రోజులకి కాజల్ ని ఫైనల్ చేసారు. ఇక ఇప్పుడు అలాంటి సమస్య రాకుండా చిరు 151వ చిత్రం మొదలయ్యేటప్పటికల్లా చిరుకి హీరోయిన్ ని సెట్ చెయ్యాలని మళ్లీ రామ్ చరణ్ దగ్గరనుండి చిత్ర యూనిట్ వరకు కష్టపడుతోంది.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క అయితే చిరుకి జోడిగా బాగుంటుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు అనుష్క కన్నా కమల్ కూతురు శృతి హాసన్ అయితే బావుంటుందని భావిస్తున్నారట. అందుకే శృతి హాసన్ ని 151వ చిత్రంలో నటించడానికి ఒప్పిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారట. ఇప్పటికే శృతి హాసన్ మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లతో నటించింది. తమ్ముడు పక్కన, కొడుకు పక్కన నటించిన శృతి ఇక ఇప్పుడు చిరు పక్కన కూడా చేస్తే బావుంటుందని అనుకుంటున్నారట. ఇప్పటికే కొడుకు రామ్ చరణ్ పక్కన నటించిన కాజల్ చరణ్ తండ్రి చిరు పక్కన కూడా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు శృతి కూడా చిరంజీవి పక్కన నటించి మెప్పిస్తుందని భావించి ఆమెనే ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు.
ఇకపొతె చిరు 151 వ చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు. అసలు చిత్రం కథాంశం ఏమిటి అనేది కూడాఇప్పటివరకు తెలియదు. ఆమధ్యన చిరు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో చిత్రం చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు.... తన 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథని తియ్యనున్నట్లు వార్తలయితే వచ్చాయి. కానీ అధికారిక అప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. మరి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు సినిమా కథ ఎంపిక కాలేదుగాని అప్పుడే హీరోయిన్ వేటలో చిత్రయూనిట్ ఉందనే గుసగుసలు వినబడుతున్నాయి.