'గుండు వల్ల వేషం పోవడం ఏమిటీ?' వినడానికి చిత్రంగానే అనిపించినా ఇది నిజం. కేవలం గుండు కారణంగా ఒక యువ హీరోకు సినిమా ఛాన్స్ పోయింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎంతో ముచ్చటపడి నిఖిల్‌తో సినిమా చేద్దామనుకుని కబురు చేశాడట. ముఖ్యంగా నిఖిల్ హెయిర్ స్టైల్ కృష్ణవంశీకి నచ్చింది. కుర్రాడు బావున్నాడు డిఫరెంట్ సినిమా చేయాలని భావించాడు. కృష్ణవంశీ నుండి కబురు వచ్చిందని తెలియగానే నిఖిల్ ఆఫీసుకు వెళ్ళాడు. వచ్చిందెవరో తెలియక వంశీ ఇబ్బంది పడుతుంటే ''నేను నిఖిల్‌ను రమ్మన్నారట''? అన్నాడు. ''నువ్వు నిఖిలా..''!! అంటూ ఆశ్చర్యపోయాడు. దీనికి కారణం ఏమంటే నిఖిల్ గుండుతో ఉన్నాడు.
నిఖిల్ గుండు చేయించుకోవడానికి కారణం ఉందట. తను నటించిన 'సూర్య వర్సెస్ సూర్య' విజయం సాధిస్తే తిరుపతికి వచ్చి గుండు చేయించుకుంటానని మొక్కుకున్నాడు. ఆ ప్రకారం చేయించుకున్నాడు. ఆ తర్వాత కృష్ణవంశీ నుండి పిలువు వచ్చింది. గుండుతో ఉన్న నిఖిల్ చూస్తూ ''నీ జుట్టు పెరగాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుంది. నిజానికి నీ హెయిర్ స్టైల్ చూసే నిన్ను పిలిపించాను. మరో మూడు నెలల్లో నాకు వేరే కమిట్‌మెంట్ ఉంది'' అని చెప్పి, ''మరోసారి చూద్దాం'' అని కూల్‌గా చెప్పాడట కృష్ణవంశీ. ఆ విధంగా గుండు కారణంగా నిఖిల్‌కు సినిమా చేజారింది. ఈ విషయాలను నిఖిల్‌కు మేనేజర్‌గా ఉన్న రాజా రవీందర్ ఒక ఇంటర్య్వూలో వెల్లడించారు.