తాజాగా అమెరికాలో పవన్ ప్రసంగిస్తూ.. తనకు చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ ఎక్కువని, దానిపై ఎక్కువగా ఆవేదన చెందుతూ ఉండటం కూడా తాను పెద్దగా చదువుకోలేకపోవడానికి కారణమై ఉండవచ్చని వెల్లడించారు. ఇది అక్షరసత్యం. ఇప్పటికీ సమాజంలోని కొందరు సామాజిక చైతన్యం ఉన్న వారు దేశం, మతం, కులం.. వంటి వాటిని బాగుచేసే వారే లేరా? మనమేం చేయలేమా? మనకున్న శక్తి సామర్ధ్యాలు సరిపోతాయా? ఏ నాయకుడిని నమ్మాలి? ఏ వ్యక్తిని చూసినా ఏముంది గర్వకారణం.. అందరూ అదే కులం, మత రాజకీయాలు చేసే వారే కదా...! దేశం ఎటుపోతోంది? మనం పోరాడాలంటే మనకున్న ఆర్ధికబలంతో పాటు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందా? రాదా? దానిపైనే దృష్టి పెడితే తమ కుటుంబం, తాను తినడానికి సంపాదన ఎలా? అని ఆవేదన చెందుతూ, ఎటూ పాలుపోని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారనేది వాస్తవం...! ఇదే ఆవేదన పవన్‌లో కనిపించింది.
తాను ఒకానొక సమయంలో ఏమీ చేయలేక ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఆయన చెప్పాడు. ఈ పరిస్థితి, భావజాలం కూడా కొంత మందిలో ఇప్పటికీ ఉంది. దేశంలో కుల, మత, ప్రాంతీయ రాజకీయాలు ఎక్కువవ్వడంతో దేశసమగ్రతకే ముప్పుగా ఆయన చెప్పారు. అలాగే నిన్నటితరం నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల నేటితరంతో పాటు భవిష్యత్తు తరాలు కూడా నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక పవన్ చెప్పిన నిన్నటితరం చేసిన తప్పుకు నేటితరం, భవిష్యత్తు తరాలు నష్టపోతున్న విషయాన్ని ఎవరైనా కాదనగలరా? ఇక్కడ దీనికి ఓ ఉదాహరణ చెప్పాలి. మన పాతతరం వారు, అంటే మన తాత ముత్తాతలు ఆనాటి కాలంలో అంటరానితనాన్ని పెంచి ఉండవచ్చు. అస్పృస్యత పాటించి, అణగారిన వర్గాలకు అన్యాయం చేసి ఉండవచ్చు. అందుకు అగ్రవర్ణాలుగా పిలవబడే బ్రాహ్మణ, రెడ్డి, కాపు, కమ్మ.. ఇలా ఎందరో కారణం అయివుండవచ్చు.
కానీ తాతలు, ముత్తాతలు చేసిన పాపానికి నేటితరంలోని ఆయా అగ్రవర్ణాలకు చెందిన వారు తిండికి లేక ఇబ్బందులు పడుతున్న వారు అనేక మంది ఉన్నారు. రిజర్వేషన్ల పేరుతో నిన్నటితరంలో వివక్షతకు గురైన అణగారిన వారి కోసం అంబేడ్కర్ వంటి వారు రిజర్వేషన్ పద్దతిని తెచ్చారు. కానీ దాన్ని ఎక్కువకాలం కొనసాగిస్తే దాన్ని వల్ల కలిగే దుష్పరిణామాలను కూడా అంబేడ్కర్ వంటి వారు పేర్కొన్నారు. కానీ మన కులరాజకీయాలు చేసే వారు ఇప్పటికీ రిజర్వేషన్లు ఇంకా పెంచాలని, ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటం చేస్తున్నారు. ప్రతి కులం వారు తమను ఎస్సీ, ఎస్టీ, బిసిలలో చేర్చాలని పటేళ్ల నుండి కాపుల వరకు దేశవ్యాప్తంగా ఎందరో హింసాయుత కార్యక్రమాలకు సైతం దిగుతున్నారు. మరి పవన్ చెప్పినట్లు నిన్నటితరం తాత ముత్తాతలు చేసిన పనికి నేడు, రేపు మనతరాలు, మన భవిష్యత్తు తరాలు బాధలు అనుభవించడం ఎంత అన్యాయం? అనేది వాస్తవం.