ఎన్ని విబేధాలు ఉన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములు. కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. విడిపోయినా వారు ఒక్కటే. రాష్ట్రాలు వేరైనా వారి మనోభావాలు ఒక్కటే. కాగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కేవలం ఏపీకి చెందిన వాడేనని, తెలంగాణ విషయం ఆయన పట్టించుకోవడం లేదని కొందరు వాదిస్తున్నారు. ఇందులో కూడా నిజం ఉంది. దానికి కారణం కూడా పలు సందర్భాలలో పవన్ చెప్పాడు. తాజాగా ఆయన అమెరికాలో చేసిన ప్రసంగంలో కూడా రాష్ట్ర విభజన విషయంలో తన ఆవేదన తెలిపాడు. 17ఏళ్లుగా నాన్చి, నాన్చిన విషయాన్ని కేవలం 12 గంటల్లో విడగొట్టడం సరైన పద్దతి కాదన్నాడు. ఇక విషయానికి వస్తే తెలంగాణ ప్రజలు, కేవలం ఏపీలోని కొందరు స్వార్ధ రాజకీయనాయకుల వల్ల, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు కాస్తా ఎంపీలు, ఎమ్మెల్యేలు కావడంతో వారు తెలంగాణకు అన్యాయం చేసిన మాట వాస్తవమే.
కానీ సామాన్య ఏపీ ప్రజలు తెలంగాణకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. వారికి అంత శక్తి కూడా లేదు. పొట్టగడవడానికి ఎవరికి వారు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు తెలంగాణ వారిని మోసం చేసేంత సమయం, ఆలోచన కూడా వారికి లేదు. తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు వలస వచ్చి, వారి కడుపుకొట్టడం అనే మాట నిజం కాదు. ఎక్కడ పని దొరికితే, ఎక్కడ బువ్వ చిక్కితే అక్కడికి వలస పోవడం సర్వసాధారణం. కాబట్టి ఏపీకి, తెలంగాణకు చెందిన నాయకులు మంచి వారు కాకపోయి ఉండవచ్చు గానీ ప్రజలు మాత్రం అన్నదమ్ములే. విభజన సమయంలో హడావుడిగా ఓట్ల రాజకీయం కోసం, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తొంరపడింది.
దీంతో ఏపీకి చివరకు లోటు బడ్జెట్ మిగిలింది. అలాగే విభజించిన కాంగ్రెస్, బిజెపిలు ఇప్పటికీ తెలంగాణ వారిని కూడా మోసం చేస్తూనే ఉన్నారు. జల వివాదాల నుంచి ఏ విషయంలోనూ సరిగా, ఇద్దరికి న్యాయం జరిగేలా చేయడం లేదు. తెలంగాణ వారు కోరుతున్న ప్రత్యేక హైకోర్టును కూడా ఇవ్వడం లేదు. దీనివెనుక కూడా రాజకీయనాయకుల కుట్ర ఉందే గానీ సామాన్యులకు అది అనవసర విషయం. కాబట్టే ఎక్కువ నష్టపోయిన ఏపీ వైపు పవన్‌తో సహా చాలామంది పాపం.. ఏపీ అని చూస్తున్నారు. ఇక కేటీఆర్ పిలుపుకు స్పందించిన పవన్ రెండు రాష్ట్రాలలోని చేనేత కార్మికుల కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా రావడానికి ఒప్పుకున్నాడు. ఇక తాజాగా అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు వచ్చిన కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, తాము కూడా అదే కోరుకుంటున్నామని, తమ ప్రజలు ఈ విషయానికి అడ్డుపడటం లేదని తెలిపి, తన గొప్పమనసును చాటింది. కానీ ఏపీ అన్యాయాలపై పోరాడే శక్తి తమకు లేదని, ఎందుకంటే విభజన తర్వాత తెలంగాణకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉండటంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పవన్ సైతం తాజాగా కవితకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపి, రెండు రాష్ట్రాల ప్రజలు, నాయకులు కలిసి తమ సమస్యలన్నింటిపై పోరాడాలని పిలుపునిచ్చిన విషయం విదితమే.