'ఓం నమో వేంకటేశాయ' సినిమాపై నెగిటివ్ కామెంట్స్ లేవు. దాదాపుగా అందరికీ నచ్చిన చిత్రమిది. నాగ్ అభినయం, దర్శకేంద్రుడి ప్రతిభ వెరసీ ఓ మంచి దృశ్యకావ్యంగా మలిచాయి. హాథీరామ్ బాబా కథని తెరకెక్కించారు. నిజానికి తెలుగు వారికి హాథీరామ్ బాబా గురించి తెలియదు. 'అన్నమయ్య', 'వెంగమాంబ' తరహాలో హాథీరామ్ గురించి వెలుగులోకి రాలేదు. స్వామితో పాచికలు ఆడిన భక్తుడు, నేడు తిరుమలలో జరుగుతున్న సంప్రదాయాలను నాంది పలికిన హాథీరామ్ గురించి అందరికీ తెలియజెప్పే ప్రయత్నాన్ని ఆహ్వానించాలి.
'గౌతమిపుత్ర శాతకర్ణి' తెలుగు వాడైనప్పటికీ, ఆయన గురించి చరిత్రలో చదవడం మినహా మరేం విధంగా ప్రాచుర్యంలో లేదు. అయిప్పటికీ 'శాతకర్ణి' సినిమాను తీసి విజయం సాధించారు. హాథీరామ్ బాబా విషయానికి వస్తే ''ఇది తెలుగు వాడి కథ కాదు . ఎవరికీ తెలియని కథ'' అని పెదవి విరుస్తూ, విమర్శలు చేస్తున్నవారున్నారు.
గతంలో అక్కినేని నాగేశ్వరరావు అనేక భక్తి పాత్రలను తెరపై ఆవిష్కరించారు. 'భక్త తుకారం', 'మహాకవి క్షేత్రయ్య', 'చక్రధారి' సినిమాలు దీనికి ఉదాహారణ. ఇవేవి తెలుగు భక్తుల సినిమాలు కావు. 'తుకారం' మహారాష్ట్రకు చెందిన భక్తుడు. అయినప్పటికీ ఈ సినిమా విజయదుందుభి మోగించింది. కాబట్టి భక్తి సినిమాలను ప్రాంతీయంగా చూడడం సరికాదు.