బుల్లితెర ప్రోగ్రామ్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'? వివరాలు వెల్లడించడం, 'మా' టీవీ లోగో మార్పు గురించి చెప్పడం కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి సోలో క్రెడిట్ కొట్టేశారు. 'ఎమ్ ఈ కె' నిర్వాహకుడు ఆయనే కాబట్టి తన కొత్త అనుభవాన్ని వివరించారు. ఇంతవరకు బాగానే ఉంది. 'మా' టీవీలో చిరంజీవికి 20 శాతం, నాగార్జునకు 10 శాతం భాగస్వామ్యం ఉంది. 2015 ఫిబ్రవరిలో 'మా' టీవీని 'స్టార్' నెట్ వర్క్ 2.500 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి ఒప్పందం ప్రకారం రెండేళ్ళ తర్వాత లోగో లో మార్పు చేశారు. ఇంతటి కీలక సమయంలో నాగార్జున కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన తన షేర్స్ అమ్మేసుకున్నారా? అనే దానిపై స్పష్టతలేదు. 'మా' టీవీ, 'స్టార్' టీవీ ఒప్పందం జరిగినప్పుడు చిరుతో పాటుగా నాగ్ హాజరయ్యారు. అందులో భాగంగా ఇప్పుడు కంపెనీ ప్రతినిధులు నిర్వహించిన మీడియా సమావేశంలో చిరంజీవి, స్టార్ టీవీ ప్రతినిధులు మాత్రమే కనిపించారు.
'ఎమ్ ఈ కె' అనేది 'మా' టీవీకి ప్రతిష్టాత్మకమైనది. గతంలో నాగార్జున నిర్వహించారు. కొనసాగింపుగా చిరు చేస్తున్నాడు. దీన్ని హైలెట్ చేయడం కోసమే నాగ్ ను పిలవలేదని తెలుస్తోంది. కేవలం చిరంజీవి మాత్రమే కనిపించాలనేది వారి ఉద్దేశంలా ఉంది.
అలాగే 'మా' టీవీలో మరో ప్రధాన భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్. ఆయనకు 65 శాతం వాటా ఉంది. ఆయన కూడా రాలేదు. కంపెనీ ప్రమోషన్ లో ఇలాంటివి సహజమే. ఎవరు వచ్చినా రాకున్న సంస్థ లక్ష్యం నెరవేరితే చాలు.