బాలీవుడ్‌లో ఐశ్వర్యారాయ్, కత్రినాకైఫ్, దీపికాపడుకోనే, ప్రియాంకాచోప్రాల తర్వాత పూర్తిస్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు 'క్వీన్'గా పేరుపొందిన కంగనారౌనత్ దూసుకుపోతోంది. కానీ ఆమె మరీ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ, అది నా తప్పుకాదు.. అని స్టేట్‌మెంట్లు ఇస్తోంది. దీంతో పలు చిత్రాల దర్శకులు, నిర్మాతలు మరో హీరోయిన్‌పై కన్నేశారు. ఆమె ఎవరో కాదు.. దక్షిణాదిలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన తాప్సి. 'పింక్' చిత్రం తర్వాత ఆమెకు ఇలాంటి క్యారెక్టర్లు విరివిగా వస్తున్నాయి.
తాజాగా ఆమె నటించిన 'నామ్ షబానా' చిత్రం ట్రైలర్ విడుదలై అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'బేబి'లోని షబానా క్యారెక్టర్‌కు సిక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కథ మొత్తం తాప్సి మీదనే నడుస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఇది రూపొందుతోంది. ఇందులో స్టార్ అక్షయ్‌కుమార్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రం మార్చి31న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని నీరజ్ పాండే నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్‌లో ఆమె యాక్షన్ సీన్స్‌లో అదరగొడుతోంది. మరోపక్క ఈనెల 17న రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఘాజీ' చిత్రం విడుదల కానుంది.
ఇందులో కూడా తాప్సి ఓ వీరోచితమైన, కీలకపాత్రలో నటించింది. కానీ ట్రైలర్‌లో మాత్రం ఆమె పాత్రను చూపించలేదు. మరోవైపు ఆమె ఈ ఏడాదిలో వరుసగా ఐదు చిత్రాలలో నటిస్తోంది. అన్ని చిత్రాలు ఇదే ఏడాది విడుదల కానున్నాయి. ఆమె నటనతో పాటు తన బహుముఖప్రజ్ఞను కూడా చాటుకుంటోంది. ప్రకాష్‌రాజ్ 'ఉలవచారు బిర్యాని'కి రీమేక్‌గా హిందీలో నిర్మితమవుతోన్న 'ధడ్కా' చిత్రంలో ఆమె కీలకపాత్రను చేస్తూ, తన పాత్రకు తానే సంభాషణలు రాసుకుంటుండటం విశేషం. దీంతో ఆమెకు దక్షిణాదిలో ఉన్న గుర్తింపు కారణంగా ఈమె చిత్రాలను తెలుగు, తమిళ భాషల్లో డబ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.