మనకు తెలిసిన జనరేషన్ విషయానికి వస్తే దర్శకరత్న దాసరి నారాయణరావు తయారు చేసిన ఎక్కువ మంది శిష్యులు చాలా కాలం తెలుగు పరిశ్రమను ఏలారు. ఆ తర్వాత అతి తక్కువ చిత్రాలతోనే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఎందరో శిష్యులను తయారు చేశాడు. ఇక ఆయనకు ఏకలవ్య శిష్యులు కూడా ఎక్కువే. దర్శకునిగా పెద్దగా రాణించలేకపోయిన సాగర్ వద్ద శిష్యరికం చేసిన వారిలో శ్రీనువైట్ల, వినాయక్, బోయపాటి, జి.నాగేశ్వర్‌రెడ్డి వంటి వారు చాలా మంది ఉన్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శిష్యునిగా చెప్పుకోవల్సిన వారిలో రాజమౌళి ముఖ్యుడు. వీరి వద్ద శిష్యరికం చేసి డైరెక్టర్లుగా మారిన వారు ప్రస్తుతం తెలుగులో టాప్‌డైరెక్టర్స్ అనిపించుకుంటూ, గురువుకి మించిన శిష్యులుగా పేరు సంపాదించారు.
కానీ వీరు మాత్రం తమలాంటి శిష్యులను తయారు చేయడంలో విఫలమవుతున్నారు. రాజమౌళి శిష్యునిగా బాలయ్యతోనే మొదటి చిత్రం 'మిత్రుడు' చేసిన మహదేవ్, అజయ్‌తో 'సారాయి వీర్రాజు' చేసిన కన్నన్, నితిన్‌తో 'ద్రోణ' చిత్రం తీసిన కరుణాకరన్, 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రం తీసిన త్రికోటి వంటి వారిలో ఎవ్వరూ సెహభాష్ అనిపించుకోలేకపోయారు. ఇక సుకుమార్, వినాయక్,పూరీ జగన్నాథ్‌ల శిష్యులైన జగదీష్, ప్రకాష్‌తోలేటి, హుస్సేన్, జయరవీంద్ర, భాస్కర్ బండి వంటి అనేకులు విజయం సాధించలేకపోయారు. గురువులు చైనావాల్‌ను ఎక్కుతుంటే శిష్యులు పిట్టగోడలను కూడా ఎక్కలేక బొక్కబోర్లాపడుతున్నారు.
అదే సమయంలో ఎవ్వరి వద్ద శిష్యరికం చేయకుండా, కేవలం లఘుచిత్రాల వంటి వాటిని తెరకెక్కిస్తున్న కుర్రాళ్లు మాత్రం అదరగొడుతున్నారు. ఇక ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడైన వెంకట్ అనే కుర్రదర్శకుడు నాగశౌర్య హీరోగా త్వరలో ఓ చిత్రం తెరకెక్కించనున్నాడు. 'జ్యో అచ్యుతానంద' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నాగశౌర్య ఇందులో హీరోగా నటించడమే కాదు.. ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ దర్శకుడైన తన గురువును కంగారుపెట్టకుండా, గురువును మించిన శిష్యుడు అనిపించలేకపోయినా గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకుంటాడో లేదో చూడాలి...!