ఎంత వారసత్వం ఉన్నా కూడా కష్టపడందే.. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు తమ కెరీర్‌ను తామే నాశనం చేసుకోకపోతేనే ఎవరైనా ఏ రంగంలోనైనా రాణిస్తారనేది వాస్తవమే. అయితే ఆయా వారసులకు తమ తల్లిదండ్రులు, లేదా తాతల వంటి వారి ఇమేజ్ బాగానే ప్రచారం కల్పిస్తాయి. సరైన ఫ్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేసి, కొంతకాలం వరకు వారికి ఢోకాలేదనే భరోసానిస్తాయి. ఇక సినిమాలలో, రాజకీయాలలో వారసత్వం బాగా ఎక్కువైంది. చిరంజీవిని ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకొని ఎందరో తమకు దారులు వేసుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్‌ల నుంచి సూపర్‌స్టార్ కృష్ణ వరకు ఎందరో తమ వారసులకు పునాదులుగా వేశారు.
కానీ కొందరు మాత్రం టాలెంట్ ఉంటేనే రాణిస్తారు.. కానీ కేవలం వారసత్వం కారణంగా మాత్రమే పైకెదగలేరని వాదిస్తుంటారు. దానికి ఎక్కడో ఒకటి అరా వ్యక్తులను ఉదాహరణలుగా చూపిస్తుంటారు. నందమూరి తారకరత్న, ఘట్టమనేని రమేష్‌బాబు వంటి వారిని ఉదాహరణస్తుంటారు. కానీ ఈ తారకరత్నకు మొదటి రోజే 9చిత్రాల ఓపెనింగ్ జరిగింది. రమేష్‌బాబు విషయంలో కూడా ఆయన నటించిన మొదటి చిత్రం 'సామ్రాట్' కు ఎంత హంగామా జరిగిందో గుర్తు తెచ్చుకోవాలి.
ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన ఎన్నో చిత్రాల తర్వాత గానీ 'శివ, గీతాంజలి' వంటి మూవీల వరకు ఆయనకు ఏయన్నార్ వారసత్వం బాగా ఉపయోగపడింది. వాస్తవానికి హీరో సుమంత్ మంచి అందగాడు. మంచి టాలెంట్ ఉండేవాడు. నాగచైతన్య కన్నా అన్ని విషయాలలోనూ ఆయన బెటరే. కానీ సుమంత్ ఎందుకు రాణించలేదు? నాగచైతన్యను ఎందుకు ఆదరిస్తున్నారు? అనేది ఇక్కడ ముఖ్యం. వారసుల విషయంలో అభిమానులకు కూడా ఓ లెక్కుంటుంది. ఇక అక్కినేని అఖిల్, నందమూరి మోక్షజ్ఞ, రామ్‌చరణ్, అల్లుశిరీష్ వంటి వారు ఇండస్ట్రీలో ఎక్కువగా రాణిస్తారని ఎవరైనా చెప్పగలరు. ఎక్కడో ఒకటిఅరా, అది కూడా స్వయంకృతాపరాధం వల్ల కొందరు రాణించలేకపోవచ్చు. ఇక రాజకీయాలలో స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ, పురంధరేశ్వరి, అల్లుడు చంద్రబాబు ఇలా ఎందరో ఆ రంగంలోకి సులభంగా ప్రవేశించారు. గాంధీ తోకతో ఇందిరా నుండి రాహుల్ గాంధీ వరకు ఇలా ఎందరినైనా చెప్పుకోవచ్చు.
కానీ స్వర్గీయ ప్రదాని పివి నరసింహారావు తనయుల వంటి కొందరు రాణించలేకపోవచ్చు. నారా లోకేష్, కేటీఆర్, హరీష్‌రావ్, కవిత వంటి వారు పునాదులు బలంగానే వేసుకుంటున్నారు. దీనికి ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు.కానీ మిగిలిన రంగాలలో అది సాధ్యమేనా? సచిన్ కొడుకు టాలెంట్ లేకుండా గొప్ప క్రికెటర్ అవుతాడని ఎవరైనా చెప్పగలరా? అబ్దుల్‌కలాం వంటి మేథస్సు కలిగిన ఎందరో సైంటిస్ట్‌ల వారసులు అదే రంగంలో రాణించగలరా? గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్, రోజర్ బన్ని వారసుడు స్టువర్ట్ బిన్నీ వంటి వారు కొద్దిమ్యాచ్‌లు ఆడినా, జట్టులో ఎందుకు రాణించలేకపోయారు? డాక్టర్ల కొడుకులు డాక్టరు కావడం, సినిమా, రాజకీయ, బిజినెస్ వంటి రంగాలలోనే తండ్రులు, తాతలు ఇచ్చిన ఆస్తులు, వ్యాపారాలలో ఎక్కువమంది రాణిస్తున్నారు. కానీ కళాత్మకమైన, టాలెంట్‌లో కూడిన ఆటలు, పాటలు, సంగీతం, సాహిత్యం, సైంటిస్ట్‌ల వంటి రంగాలలో వారసులకు భరోసా ఉందా? అనేది ఆలోచించాల్సిన విషయం.