నందమూరి బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' కథని తన వందవ సినిమా కోసం ఎంచుకుని తొలి విజయం సాధించారు. అక్కినేని నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ'లో అద్భుతంగా నటించారు. కళ్లు చెమర్చాయి. ఈ రెండు అభిప్రాయాలను వ్యక్తం చేసింది మెగాస్టార్ చిరంజీవి. ఇతర హీరోలను అభినందించడంలో చిరంజీవి ఎలాంటి భేషజాలకు పోరు. తనకి ఏదైనా సినిమా నచ్చితే కొన్ని సార్లు ప్రత్యేకంగా ఫోన్ చేసి హీరోని, దర్శకుడిని ప్రశంసించిన సందర్భాలున్నాయి. ఇలాంటి సహృదయాన్ని అభినందించాల్సిందే.
ఇకేపోతే బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా చేసిన ప్రయత్నాలను తానెందుకు చేయలేకపోతున్నాడు? అనే విషయాన్ని చిరంజీవి స్మరణకు తెచ్చుకుంటే మంచిదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేస్తూ, పక్కా మాస్ హీరో అనే పేరుకోసమే చిరు ఆలోచిస్తున్నారు. తనలోని నటుడికి న్యాయం చేసే ప్రయత్నం చేయడంలేదని ఆ వర్గాలు అంటున్నాయి. 'ఖైదీ నెంబర్ 150' సినిమా కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మాత్రమే పేరు తెచ్చుకుంది అంతేకానీ నటుడిగా చిరంజీవికి దక్కిన ప్రశంసలు లేవు. ఆరు పదుల వయస్సులో కుర్రాడిలా చేశాడని మాత్రం అన్నారు.
నాడు అక్కినేని, ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్స్ సైతం సందర్భం వచ్చినపుడు నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ తరంలో బాలకృష్ణ, నాగార్జున కూడా అదే బాటలో పయనిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ కమర్షియల్ సినిమాల్లోనే ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎటొచ్చి మెగాస్టార్ మాత్రం కొత్తగా ఆలోచించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
స్టార్ గా, మెగాస్టార్ గా చిరంజీవి ఎన్నో విజయాలు చూశారు. ఇక ఆయన కొత్తగా సాధించేది ఏమీ లేదు. ఇప్పటికైనా నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంపికచేసుకుంటే బావుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో కూడా ఉంది. 'ఉయ్యాలవాడ' కథని చేస్తారని అంటున్నారు. అలాగే ఇంకా అనేక వైవిథ్యమైన పాత్రలు చేస్తే నటుడిగా చిరస్థాయిగా నిలవడమే కాకుండా, కొత్తతరానికి మార్గదర్శి అవుతాడు.