తమిళనాడు రాజకీయాలు రాజకీయ నేతలకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. అధికారం చేజిక్కించుకోవడం అంత సులువు కాదని తెలియజేస్తున్నాయి. బలవంతంగా ముఖ్యమంత్రి కావాలని పావులు కదిపిన శశికళను రాజ్యాంగ వ్యవస్థ అడ్డుకుంది. ఆమెపై ఉన్న అక్రమాస్తుల కేసు అడ్డంకిగా మారింది. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో జగన్ వర్గంలో గుబులు రేపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పై అక్రమాస్తుల కేసు నడుస్తోంది. అన్నీ అనుకూలించి 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించినా సి.ఎం.పీఠం దక్కించుకోవడానికి ఈ కేసు అడ్డుతగిలే ప్రమాదం ఉంది. అక్రమాస్తుల కేసుపై తుది తీర్పు రావాలి. లేదంటే తమిళనాడులోని ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది రాజకీయవర్గాలు అనుమానిస్తున్నాయి.
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ, ప్రత్యేక హోదా అస్త్రంగా ప్రజలను కదిలించాలని జగన్ ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నికల లోపు చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయగలిగితే ఆ తర్వాత తనకు పట్టం గడతారని భావిస్తున్నారు. పరిస్థితులు అనుకూలించి, మెజారిటీ శాసనసభ్యులను గెలిపించుకుని, పార్లమెంటరీ నేతగా ఎన్నికైనా సరే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి అక్రమాస్తుల కేసు అడ్డు పడుతుందనేది తమిళనాడు పరిణామాలతో స్పష్టమైంది. తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావు ఈ కారణంగానే శశికళను ఆహ్వానించలేదని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైన పక్షంలో ఆ తర్వాత ఇతర రాష్ట్రాల గవర్నర్ లు సైతం ఇదే నిబంధన పాటించే అవకాశం ఉంది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో ఉంది. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. ఇక్కడ నిందితుడిగా తేలితే ఆ తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. లేదా కింది కోర్టులోనే నిర్దోషిగా తేలితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.తమిళనాడు పరిణామం తెలుగు దేశం వర్గాల్లో ఆసక్తి కలిగిస్తే, వైకాపా నేతల్లో మాత్రం ఆందోళన కలిగించడం ఖాయం.