ప్రస్తుతం జనసేనాధి నేత పవన్ అమెరికాలో బిజీ బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడు. న్యూహ్యాంప్‌షైర్‌లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్యాయం ఎక్కడ జరిగినా ఉద్యమిస్తాను. అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేను. నాకు రాజకీయాలపై, పదవులపై పెద్దగా ఆసక్తిలేదు. సినిమాలలో నేనెప్పుడూ సౌకర్యంగా ఫీలవ్వలేదు. 'జానీ' చిత్రం హిట్టయి ఉంటే సినిమాలను వదిలేసేవాడినేమో. నేను బాధితుల తరపున పోరాడుతాను. నాకు సమాజాన్ని చదవడం అలవాటు. ప్రజాసమస్యలపై పోరాటం మొదలుపెట్టిన తర్వాతే సంతృప్తిగా ఫీలయ్యాను. సమస్యలను సరిగ్గా అడ్రస్ చేయలేకపోవడం వల్లే ఉద్యమాలు వస్తున్నాయి.
రాజకీయనాయకులలోని ఆ తత్వం నాకు నచ్చదు. కులరాజకీయాలు నాకు నచ్చవు. నాకు ఓపిక ఉన్నంత వరకు సినిమాలలో నటిస్తాను. డబ్బులు నాకు అవసరమే కానీ దానిపై మమకారం లేదు. దేశం మనకేమిచ్చిందని కాదు.. దేశానికి మనమేమిస్తున్నదే ముఖ్యం. నాకు అధికారం అంతిమలక్ష్యం కాదు. వారసత్వ రాజకీయాలు, నియంతృత్వ పోకడలు, స్వార్థ రాజకీయాలు నాకు నచ్చవు. నాకు ఎవ్వరి మీద వ్యక్తిగత కోపం లేదు. యువతరం రాజకీయాలలోకి రావడమంటే కేవలం రాజకీయనాయకుల వారసులే రావడం కాదు. మీలాంటి యువత రాజకీయాల్లోకి రావాలి. సమాజాన్ని బాగుపరిచే దిశగా నడవాలని భావిస్తున్న నాకు ప్రవాస భారతీయుల, యువత సహకారం కావాలి. నేను రాజకీయాలలోకి వచ్చినప్పుడు చాలా మంది భయపెట్టారు. చంపేస్తామని బెదిరించారు. భయపడితే ఇంత దాకా వస్తామా? నాకు జాగ్రత్త ఉంది కానీ భయంలేదు. రోజూ భయపడుతూ చావడం కన్నా ఒకేసారి చస్తే బాగుంటుంది.
సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్‌ను ప్రజాసమస్యలు పరిష్కరించడానికి వాడుకుంటాను. అందుకే సినిమాలు చేస్తాను. బాధ్యతలు ఎక్కువైనప్పుడు సినిమాలకు దూరంగా ఉంటానేమో గానీ, సినిమాలు వదిలేయను. సినిమాల ద్వారా ఇమేజ్, డబ్బు వస్తుంది. నిజ జీవితంలో సినిమా డైలాగ్స్ చెప్పను. మీలో నుంచి నాకు బలమైన నాయకత్వం కావాలి. మీలాంటి వారి కోసం చూస్తున్నాను.. అంటూ ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో ఆయన 'గబ్బర్‌సింగ్' టవల్ వేసుకున్నారు. ఇది 'గబ్బర్‌సింగ్' సింబల్ కాదు.. సామాన్యుడి సింబల్. భారతదేశంలో దీనికి కుల, మత రంగులేదన్నాడు. ఈ ప్రసంగం విన్న పలువురు రాష్ట్రంలోని వామపక్షనాయకులు పవన్ భావజాలం తమను పోలివుందంటూ ఆయనకు మద్దతు ఇవ్వడానికి సిద్దమంటున్నారు. ఇక పవన్ ప్రసంగంపై కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రముఖ రాజకీయ నిపుణుడు, ప్రస్తుతం యూపీలో అఖిలేష్‌యాదవ్‌కి సలహాలు ఇస్తున్న, అమెరికా రాజకీయాలలో ఎందరికో గురువైన ప్రొఫెసర్ స్టీవెన్ జార్డింగ్‌తో పాటు మరెంతో మంది రాజకీయ విశ్లేషకులు, వ్యూహకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్న సంగతి తెలిసిందే.