పవన్ ప్రస్తుతం మరలా సినిమాలలో బిజీ అయిపోయాడని, మరలా ఆయన తనకు సమయం ఉన్నప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ మాత్రం రాజకీయాలను అంత తేలిగ్గా తీసుకోవడం లేదని, దానిపై కూడా ఓ కన్నేసి ఉంచాడని సమాచారం. పవన్ ఇటీవల ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. కానీ టిడిపి, బిజెపిలు మాత్రం ఆ ఉద్యమానికి ప్రజల సహకారం లేదని, ప్రజలలో ప్రత్యేక ప్యాకేజీ అయినా చాలనే భావన ఉందని, ప్రత్యేకహోదా విషయంలో పెద్దగా ప్రజల్లో సెంటిమెంట్ లేదని వాదిస్తున్నారు. దాంతో పవన్ సైతం ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నాడు.
మరోపక్క తనకు, తన స్నేహితుడైన శరత్‌మరార్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ టీవీఛానెల్ ద్వారా ఆయన నిజంగా ఏపీ ప్రజల్లో ప్రత్యేకహోదా సెంటిమెంట్ ఉందా? లేదా? ఉంటే ఏ స్థాయిలో ఉంది? అధికారంలోకి తేగలిగిన, జనసేనను బలంగా చేసేంత స్థాయిలో ప్రజల్లో ఆ సెంటిమెంట్ ఉందా? అని ఓ రహస్య సర్వే చేయిస్తున్నాడని సమాచారం. అంతేకాదు... జిల్లాల వారీగా, ప్రాంతాల వారిగా ఉన్న సమస్యలు ఏమిటి? స్థానికంగా ప్రజలు తమ తమ ప్రాంతాలలో ఏయే సమస్యలను ఎదుర్కొంటున్నారు? వాటికి పరిష్కార మార్గాలు ఏమిటి? ఏయే అంశాలను లేవనెత్తితే ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుందనే విషయాలను కూడా ఆయన ఈ సర్వే ద్వారా సేకరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాడని సమాచారం. మరి పవన్ వ్యూహం ఎలా ఉండబోతోందో? త్వరలోనే తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.