స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్‌ల తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ తెలుగు సినీ ప్రపంచాన్ని రారాజుగా ఏలాడు. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి మాత్రమే తన నటన, స్టెప్స్, టైమింగ్, యాక్షన్ చిత్రాలతో సుప్రీం హీరో స్థాయి నుండి మెగాస్టార్ రేంజ్ వరకు వెళ్లాడు. తెలుగులో ఆనాడు ఎంతమంది స్టార్స్ ఉన్నా నెంబర్1 నుంచి నెంబర్10 వరకు చిరంజీవేనని, ఆ తర్వాతే తాము అని నాగార్జున, సుమన్ వంటి వారితో పాటు చాలా మంది పబ్లిక్‌గానే ఒప్పుకున్నాడు. అలా టాలీవుడ్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా మెగాస్టార్ అన్నీ తానై ఏళ్లకు ఏళ్లు ఏలాడు.
కానీ ఆ తర్వాత ఆయన రాజకీయాలలోకి వెళ్లాడు. ఆ తర్వాత పవన్, మహేష్ వంటి వారు నెంబర్ వన్ స్థానం కోసం గట్టిగా కృషి చేశారు. అదే సమయంలో పలువురు ఇతర యంగ్‌స్టార్స్ కూడా సంచలనాలను క్రియేట్ చేసి, టాలీవుడ్‌ని ఉన్నతశిఖరాలకు చేర్చి, తెలుగు సినిమా స్థాయిని, స్టామినాను పెంచారనడం వాస్తవం. ఇక రాజకీయాలలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన చిరు తన 150 వ చిత్రం 'ఖైదీ' ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆయన్ను తిరిగి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానం పలువురిని వేధించింది. దానిని పటాపంచలు చేస్తూ, నిర్మాతల లెక్కల ప్రకారం ఈ చిత్రం దాదాపు 150కోట్లు వసూలు చేసిందట.
అలా 'నాన్ బాహుబలి' రికార్డులను ఈ చిత్రం తిరగరాసిందని మెగాభిమానులు అంటున్నారు. చిరు సినిమాలను వదిలేసి దాదాపు దశాబ్దం అయినా ఆయన విడిచివెళ్లిన నెంబర్‌వన్ స్థానాన్ని ఎవ్వరూ ఆక్రమించలేకపోయారని మెగాభిమానులు వాదిస్తున్నారు. దాంతో మరలా చిరునే ఆ స్థానాన్ని తిరిగి వచ్చి భర్తీ చేశాడంటున్నారు. మరి ఈ వాదనలో నిజమెంత ఉందో సినీ వర్గాలే తేల్చాలి. తాజాగా కొందరు చిరు, పవన్, మహేష్‌లను కోలీవుడ్ స్టార్స్‌తో పోల్చి ఆసక్తికర విశ్లేషణ చేస్తున్నారు. కోలీవుడ్‌లో రజనీ స్థాయి హీరో టాలీవుడ్‌లో చిరంజీవి అని, ఇక పవన్ రేంజ్ అజిత్‌కు సమానంగా, మహేష్ విజయ్ స్థాయిలో రాణిస్తున్నాడనే వాదనను తెరపైకి తెచ్చారు. మరి కొన్నాళ్లు ఆగితే గానీ ఈ విషయంపై స్పష్టత రాదు.