ప్రతిభ అనేది ఎప్పుడు ఎక్కడ దాగివుంటుందో, ఎవరిలో నిక్షిప్తమై ఉంటుందో తెలుసుకోవడం కష్టం. కాగా బుల్లితెరపై నటునిగా, ఆ తర్వాత రచయితగా మారిన టాలెంటెడ్ పర్సన్ హర్షవర్ధన్. కాగా ఆయన నితిన్, విక్రమ్ కె.కుమార్‌లు ఇచ్చిన ప్రోత్సాహంతో 'ఇష్క్, గుండెజారి గల్లంతయిందే'లతో పాటు 'మనం' చిత్రానికి కూడా రచయితగా పనిచేసి ప్రశంసలు అందుకున్నాడు. కానీ అతని గోల్ కేవలం దర్శకునిగా తన ప్రతిభను చాటడమే.
ఎప్పటి నుంచో హర్షవర్దన్ దర్శకత్వ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన శ్రీముఖి ప్రధాన పాత్రలో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా మొదటి చిత్రం పూర్తయి ఇంకా విడుదల కాలేదు. కానీ ఆయనకు మాత్రం రెండో అవకాశం అప్పుడే లభించింది. మహేష్ ఫ్యామిలీ హీరో సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ రెండో చిత్రం ఉంటుంది. ఇక విషయానికి వస్తే పవన్ లాంటి స్టార్ చిత్రంలో పనిచేసే అవకాశం వస్తే నటీనటులే కాదు.. సాంకేతిక నిపుణులు కూడా ఎగిరిగంతేస్తారు. కానీ ఈ విషయంలో హర్షవర్ధన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. త్వరలో ప్రముఖ నిర్మాత ఎ.యం.రత్నం తాను తమిళంలో అజిత్‌తో చేసిన 'వేదాలమ్' చిత్రాన్ని త్వరలో తమిళ దర్శకుడు నీసన్ దర్శకత్వంలో పవన్‌తో చేయనున్న సంగతి తెలిసిందే.
దాంతో ఈ చిత్రానికి పూర్తి తెలుగు నేటివిటీ ఇవ్వగలిగిన రచయిత కోసం ఆయన వెతుకుతున్నాడు. దీంతో కొందరు సన్నిహితులు హర్షవర్ధన్ పేరును సూచించారని తెలుస్తోంది. ఎ.యం.రత్నం ఈ చిత్రానికి పనిచేయమని హర్షవర్దన్‌ను అడిగాడని, అందుకోసం మంచి రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశాడని సమాచారం. కానీ ప్రస్తుతం తన దృష్టి అంతా తాను దర్శకత్వం వహించే చిత్రాలపైనే ఉందని, దాంతో తాను మరలా రచయితగా పనిచేయలేనని హర్షవర్ధన్ సున్నితంగా పవన్ చిత్రానికి పని చేయడానికి తిరస్కరించాడట. మొత్తానికి టాలీవుడ్‌కు మరో త్రివిక్రమ్ శ్రీనివాస్ లభిస్తాడని చాలా మంది హర్షవర్దన్‌పై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ స్థాయికి ఆయన చేరగలడా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది.