ఇటీవల తమిళనాడులో జరిగిన 'జల్లికట్టు' వివాదంపై మహేష్ స్పందించి, దానికి మద్దతు పలికాడు. పవన్ ఎలాగూ స్టార్‌తో పాటు జనసేన పార్టీకి అధినేత కావడంతో ఆయన కూడా స్పందించి, తమిళుల తరహాలో మనం కూడా 'ప్రత్యేకహోదా' ఉద్యమం కోసం పోరాడాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ జల్లికట్టుపై స్పందించిన మహేష్ ప్రత్యేకహోదా విషయంలో మౌనంగా ఉండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వర్మ కూడా మహేష్‌ను విమర్శించడంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన కేవలం తమిళ మార్కెట్ కోసమే 'జల్లికట్టు'కు మద్దతు తెలిపాడంటూ ఆయనకు వ్యతిరేకులందరూ దానినే అస్త్రంగా తీసుకుని, విమర్శలు గుప్పించారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు ఈ విషయంలో స్పందించాలని ముందుగా భావించినా కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో సంబంధాలు సరిగా లేవని, దాంతో తమకు మరిన్ని ఇబ్బందులు వస్తాయని మౌనం వహించారు. సినిమా వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం మొదట్లో తమిళ 'కత్తి' రీమేక్‌ను ఎన్టీఆర్ చేయాలని భావించాడు. కానీ ఈ చిత్రం కథ, ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబుకు, బాబాయ్ బాలకృష్ణకు కోపం తెప్పిస్తుందని ఆయన ఆ చిత్రమే వదులుకున్నాడట. ఇక మెగాఫ్యామిలీకి చెందిన అప్‌కమింగ్ హీరోలు ఈ విషయంలో స్పందించారే గానీ బన్నీ, రామ్‌చరణ్ వంటి వారు మాత్రం మౌనంగా ఉన్నారు. దాంతో మహేష్ కూడా మౌనంగా ఉండి ఉంటే బాగుండేదని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. ఇక మహేష్ ఈ వివాదాన్ని, విమర్శలను ముందుచూపు లేకుండా కొనితెచ్చుకున్నాడనే చెప్పాలి. కాగా వివాదాల జోలికి వెళ్లని మహేష్ మరోసారి వివాదంలో చిక్కుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాను రచించిన నవల 'చచ్చేంత ప్రేమ' అనే దానిని 2012లోనే 'స్వాతి' పత్రిక ప్రత్యేక అనుబంధంగా ప్రచురించిందని, ఆ కథను సినిమాగా తీయడానికి వెంకట్రావ్ అనే నిర్మాత కూడా తన వద్ద రైట్స్ తీసుకొని, సముద్ర దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తీయాలనుకున్నాడని, అంతలోనే ఆ కథను కాపీ కొట్టి మహేష్, దర్శకుడు కొరటాల శివతో పాటు మైత్రి మూవీస్ సంస్థ అధినేతలు 'శ్రీమంతుడు' తీశారని రచయిత శరత్‌చంద్ర ఇప్పటికే నానా రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను ఇంతకాలం ఆలస్యం చేయడానికి కారణం తాను వ్యక్తిగత పనుల మీద కేరళలో ఉండటమేనని ఆయన కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. తాను డబ్బు కోసం ఈ పనిచేయడంలేదని, తనకు జరిగిన అన్యాయంపైనే తన ఆవేదన ఆని ఆయన తెలిపాడు. ఈ విషయంలో తాను తెలుగు, తమిళ రచయితల సంఘాలను, పలువురు సినీ పెద్దలను కలిసినా తనకు న్యాయం జరగలేదని అంటున్నాడు. దీంతో నాంపల్లి కోర్టు మహేష్‌తో పాటు దర్శకుడు కొరటాలను, నిర్మాతలను మార్చి3 వ తేదీన కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. దీంతో ఈ వివాదం ముదిరి పాకాన పడినట్లు అర్ధమవుతోంది.
మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం మైత్రి మూవీస్ అధినేతలకు కాదు.. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన మహేష్‌కు సైతం భారీ లాభాలను తెచ్చిపెట్టింది. సినిమా ఫీల్డ్‌లో ఇలాంటివి కామనేనని గ్రహించి, ఆ రచయితకు ఎలాగోలా నచ్చచెప్పకుండా తెగే దాకా లాగితే అది మహేష్‌కు, ఆ చిత్రానికి కూడా చెడ్డపేరు రావడం తేవడం ఖాయంగా కనిపిస్తోంది. మహేష్ కూడా అలా చేస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం మహేష్‌కు ఇతర యూనిట్‌కు అవసరం.