తాను 'ఆరెంజ్' చిత్రం డిజాస్టర్ తర్వాత అన్ని అమ్మేసి ఏమీ లేనివాడినయ్యానని, తన పిల్లలకు, తన తమ్ముడు, అన్నలకు కూడా సహాయపడలేని దీనస్థితిలోకి రావడంతో ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించేదని ఆవేదగా మాట్లాడారు. కానీ ఈ ఫెయిల్యూర్ విషయంలో తాను చరణ్‌నుగానీ, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ను గానీ తప్పుపట్టనని ఒకప్పుడు చెప్పిన మాటలనే ఇప్పుడూ చెప్పాడు నాగబాబు. ఇక పవన్ కమ్యూనిజం, క్యాపిటలిజం, తత్వశాస్త్రం వంటివి అనేకం చదివాడని, ఆయన మనస్తత్వానికి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో ఎక్కడా ఇమడలేకపోయాడన్నాడు. అందుకే జనసేనను స్థాపించాడని గుర్తుచేశారు. తనకు అవకాశం వస్తే తన తమ్ముడి జనసేనకు ఓ సాధారణ కార్యకర్తగా పనిచేస్తానని ఉద్ఘాటించారు. తన అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారో లేదో తాను చెప్పలేనన్నాడు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమై పోయిందన్న విషయాన్ని నాగబాబు అంగీకరించాడు. ఇక తన అన్నయ్య చిరు మాత్రం రాజకీయాలతో పాటు నటునిగా కూడా కొనసాగుతాడని భావిస్తున్నట్లు తెలిపాడు.
ఇక 'జబర్దస్త్' కామెడీ షోలో కొన్నిసార్లు కామెడీ శృతిమించి బూతుగా మారుతుండటాన్ని తాను ఒప్పుకుంటానన్నాడు. తాను కార్యక్రమం జరిగే సమయంలో వాటిని ఖండించలేనని, కానీ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత బూతు, వల్గారిటీ లేకుండా చూడాలని తాను కార్యక్రమంలో పాల్గొనే వారిని కోరుతుంటానని తెలిపాడు. కొంతకాలం వారు నా మాటను విన్నారని తర్వాత మరలా బూతు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబసభ్యులంతా కలిసి చూసే 'జబర్దస్త్'లో వల్గారిటీ ఉండకూడదనేది తన అభిప్రాయంగా తెలిపాడు. మరోవంక 'ఆరంజ్' ఫ్లాప్ తర్వాత తాను తీవ్ర ఆర్థికసంక్షోభంలో ఉండి ఆత్మహత్య చేసుకోవాలని భావించినప్పుడు తన అన్న చిరు, తమ్ముడు పవన్‌లు తనకు ఫోన్ చేసి, ఆర్థికంగా మరలా నిలబడడానికి మేమున్నామని ధైర్యమిచ్చారని తెలిపాడు. వారిద్దరు నాకు విడివిడిగా ఫోన్ చేసి నన్ను ఆదుకుంటామని చెప్పిన విషయం ఇద్దరికీ ఇప్పటివరకు తెలియదన్నాడు. వారు ఆలా ప్రోత్సహించడంతోనే నేను మరలా జీవితంలో ఫైట్ చేయాలనే నిర్ణయానికి వచ్చానన్నాడు. ఇక తాను యండమూరిపై చేసిన వ్యాఖ్యలు సమంజసమేనని, కానీ చాలా ఆలస్యంగా వాటిపై స్పందించినందుకు తనను క్షమించాలని కోరాడు. ఇక మీ అన్న లేకపోతే నువ్వు జీరో అని వర్మ తనను ఆనడం కూడా నిజమేనని, తాను దానిని అంగీకరిస్తున్నానని తెలిపాడు. మొత్తానికి నాగబాబు చాలా ఓపెన్‌గా ఈ విషయాలను మాట్లాడాడని చెప్పవచ్చు.