హిందీ, మలయాళం, తమిళం వంటి భాషల్లో స్టార్‌హీరోలు కూడా మంచి వైవిధ్య చిత్రాలను తీస్తున్నారు. కానీ మన తెలుగులో మాత్రం స్టార్‌హీరోలు అలాంటి ప్రయోగాలు చేయలేకపోతున్నారు అనే విమర్శ ఎప్పటినుంచో ఉన్నదే. ఇది పచ్చి వాస్తవం. కానీ ఇటీవల మన సోకాల్డ్ కమర్షియల్ చిత్రాలను తీస్తూ, టాటా సుమోలను గాలిలోకి లేపి పేల్చేస్తూ, ఓ వీరోచిత హీరో...ఆయన ఫ్లాష్‌బ్యాక్‌ను మరో సపోర్టింట్ యాక్టర్ ఫ్లాష్‌బ్యాక్‌లో వివరించే రొటీన్ చిత్రాలను తీసే వినాయక్ దీనిపై మండిపడ్డాడు. హిందీ, తమిళం, మలయాళం స్టార్స్ వైవిధ్యమైన చిత్రాలను తీస్తున్నారని, మన హీరోలు తీయలేకపోతున్నారని మాట్లాడటం అసలు తెలుగు పరిశ్రమను, ఇక్కడి స్టార్స్‌ను, డైరెక్టర్లను చిన్నచూపుగా చూపించే వ్యాఖ్యలేనని.. కాబట్టి మన వారిని మనం విమర్శించడమంటే మనల్ని మనం విమర్శించుకోవడమేనన్న వింత వాదన వినిపిస్తూ.. అలా విమర్శలు చేసే వారు నోరు మూసుకోవాలనే తరహాలో వార్నింగ్ తరహా హెచ్చరికను జారీ చేశాడు.
ఇది వినాయక్ చేతగానితనానికి, ఆయన వితండవాదానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.'ఆది' నుంచి తాజాగా 'ఖైదీ' చిత్రం వరకు వినాయక్ చూపించిన వైవిద్యం ఏమిటో ఆయనే చెప్పాలి. 'ఠాగూర్, ఖైదీ' చిత్రాలను ఇన్నర్‌గా మంచి మెసేజ్‌ను అందిస్తూ కమర్షియల్ హంగులు అద్ది చిరు ఇమేజ్‌కు తగిన విధంగా ఆయన తీసిన విధానాన్ని చూసి ఆయన్ను మెచ్చుకున్నవారు ఉన్నారు. కానీ ఈ రెండు చిత్రాలు రీమేక్‌లే. 'యోగి'లాంటి మదర్‌సెంటిమెంట్‌తో రూపొందిన కన్నడ చిత్రంలోని ఆత్మను పట్టుకోలేక ఆయన తెలుగులో బోర్లాపడ్డాడు. ఇప్పటివరకు ఆయన తీసిన గొప్ప చిత్రం ఏమిటో ఆయనకు తెలుసా? ఇక తెలుగులో మన పాత తరం దర్శకులతో పాటు విశ్వనాథ్, దాసరి, ప్రస్తుతం భక్తిరస చిత్రాలను తనదైన కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దుతున్న రాఘవేంద్రరావు, క్రిష్, శేఖర్‌కమ్ముల, ఒకప్పటి టి.కృష్ణ ముత్యాలసుబ్బయ్య వంటి వారెందరో అద్భుతమైన, కలలో ఊహించలేని సబ్జెక్ట్‌లనుకూడా కమర్షియల్ టచ్‌తో తీసి సంచలనం సృష్టించారు.
'శంకరాభరణం, తూర్పు పడమర' నుంచి ఎన్నోఎన్నోచిత్రాలను, దర్శకులను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక దక్షిణాదిలో కె.బాలచందర్, మణిరత్నం, శంకర్, బాలు మహేంద్ర, ప్రియదర్శన్, ఫాజిల్, భారతీరాజా, మణిరత్నం, బాపు, విక్రమ్‌కె.కుమార్ వంటి ఎందరో సినిమాలకు కొత్త భాష్యం చెప్పారు. హిందీలో ఈ మధ్యకాలంలో వచ్చిన నేటితరానికి గుర్తున కొన్నిచిత్రాలనే మనం ఉదాహరణగా చెప్పవచ్చు, 'లగాన్, మున్నాభాయ్ ఎంబిబియస్, లగే రహో మున్నాభాయ్, త్రీఇడియట్స్, పీకే, చక్‌దే ఇండియా, భాగ్ మిల్కా భాగ్' నుండి తాజాగా వచ్చిన 'దంగల్' వరకు ఇవ్వన్నీ ఎంతటి విజయాలను అందుకున్నాయో వినయ్‌కు సరిగా అవగాహన లేదు. ఇక పాతతరం గురించి చెబితే కూడా ఎన్నోఉదాహరణలు తెలుగులోనే ఉన్నాయి. కానీ అవి నేటితరానికి, ముఖ్యంగా మీలాంటి నేటితరం దర్శకుడైన వినయ్‌కి అంత లోతుగా వెళ్లితే ఆయన పరిజ్ఞానం చాలదు.
కమల్, విక్రమ్, అమీర్, షారుఖ్, మమ్ముట్టి, మోహన్‌లాల్..ఇలా ఎందరో దేశపతాకాన్ని వినువీదుల్లో ఎగురవేశారు. అలాంటి చిత్రాలు తెలుగులో రావడం లేదన్న మన ఆవేదన వినాయక్‌కు మన పరువును మనమే తీస్తున్నామనే ఆగ్రహం కలిగించేలా చేసింది.కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల వినాయకే మన నటీనటుల, దర్శకుల ప్రతిభను కించపరుస్తున్నాడు. గతంలో ఇలాంటి ప్రశ్నలనే వర్మ, రాజమౌళిలకు వేస్తే...తమకు ఓ మణిరత్నం లాగానో లేక విశ్వనాథ్ గారి లాగానో తీయడం చేతకాదని, ఆ స్థాయి, ఆ తరహా చిత్రాలను తాము తీయలేమని స్వయంగా ఒప్పుకున్నారు. కానీ వినయ్ వితండ వాదన చేస్తున్నాడు. ఇక ఆయన చిరంజీవితో నాగబాబు నిర్మించిన 'రుద్రవీణ' నాగబాబుకు కోట్లాదిరూపాయల నష్టం తెచ్చిందని, వాటిని ఎవరు తీరుస్తారు? సినిమా అంటే కోట్ల డబ్బుతో, ఎందరి జీవితాల్లో ఆధారపడిన విషయం అని వినయ్ సెలవిచ్చారు. నిజమే.. కానీ చిరు తొలికాలంలో నటించిన 'పున్నమినాగు, రుద్రవీణ, స్వయంకృషి, ఆరాధన, ఆపద్బాంధవుడు'లతో పాటు ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన 'ఖైదీ'చిత్రం కూడా ఆనాడు ఓ విభిన్న కథాంశమే. వీటి ద్వారా చిరుకి ఎంత పేరు, ప్రఖ్యాతులు వచ్చాయో వినయ్‌కి తెలుసా? కోట్లాది రూపాయలతో ప్రయోగాలు చేయమని ఎవ్వరూ చెప్పరు.
కానీ ఇటీవల షారుఖ్ అతి తక్కువ బడ్జెట్‌తో చేసిన 'డియర్‌జిందగీ' ఆయనకు నటునిగా, నిర్మాతగా లాభాలను తెచ్చిపెట్టలేదా? మరి కోట్లాది డబ్బులతో నీవు తీసిన పక్కా కమర్షియల్ చిత్రాలన్నీ లాభాలు తెచ్చాయా? 'బద్రినాథ్, అఖిల్' వంటి ఎన్ని పక్కా కమర్షియల్ చిత్రాలు నిర్మాతలకు నష్టం తేలేదు?. ఇక నాగబాబుకు కేవలం 'రుద్రవీణ' మాత్రమే కాదు.. 'బావగారూ బాగున్నారా...'తప్ప ఆయనకు 'ఆరేంజ్‌తో పాటు ముగ్గురుమొనగాళ్లు, గుడుంబాశంకర్' వంటి కమర్షియల్ మూవీస్ కూడా నష్టాలనే మిగిల్చాయి. కోట్లను ఖర్చుపెట్టి కాకుండా, లోబడ్జెట్‌లో స్టార్స్ నటిస్తే నష్టాలు ఎందుకు వస్తాయి? ఇక ఆయన మాట్లాడుతూ, కమర్షియల్ చిత్రాలను తీసే డైరెక్టర్లు ఆర్ట్‌ఫిల్మ్స్‌ను, అవార్డు చిత్రాలను ఈజీగా తీయగలరు కానీ.. ఆర్ట్, అవార్డు చిత్రాలు తీసే వారు కమర్షియల్ చిత్రాలను తీయలేరని సెలవిచ్చాడు.
ఇది కూడా శుద్ద అబద్దం, నాగ్ తన కెరీర్‌లో ఎన్ని ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడో నీకు తెలుసా? 'భైరవద్వీపం'లో బాలకృష్ణ కురూపిగా నటించి విజయం సాధించాడు. 'ఆదిత్య369' దీనికి మరో ఉదాహరణ. ఇక ఆయన మంచి చిత్రాలను తీసిన నీలకంఠను ఎందుకు ఆదరించలేదు అని ప్రశ్నించాడు. ఇలా వినయ్ వేసిన ప్రతి ప్రశ్నకు మా వద్ద సమాధానం ఉంది. ఇండియన్‌సినిమా పుట్టినప్పటి నుంచి నేటి వరకు వాటిని ఉదాహరణలతో కూడా చెప్పగలం. కానీ సమయాభావం, స్థలాభావం వల్ల చెప్పలేకపోతున్నాం.. ప్రతిదానికి ఆయనతో చర్చకు సిద్దం....!